ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైన వేళ అందుకోసం భద్రతా పరంగా చాలా సూక్ష్మమైన కసరత్తు సాగుతోంది. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ - Indian School of Business) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం భారీగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తికి ఈ ఏర్పాట్లు సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు  మాత్రం సోషల్ మీడియాలో కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడ పడుతున్నారు.


ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన కోసం స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో బాగుంటేనే ఆయా విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వాలని చూస్తున్నారు. ఎవరైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటే వారికి అనుమతించరు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికేట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.


ఐదేళ్లకోసారి ఘనంగా స్నాతకోత్సవం, ప్రత్యేక అతిథి కూడా
ఐఎస్‌బీ గతంలో 5వ వార్షికోత్సవానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, 10వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రతిభ పాటిల్, 15వ వార్షికోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు మే 26న జరిగేది  20వ వార్షికోత్సవం. దీనికి ప్రధాని మోదీ విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడనున్నారు. 


సీఎం కేసీఆర్ దూరం
ఈ 20వ వార్షికోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని ఐఎస్‌బీ డీన్ మదన్ తెలిపారు. అయితే, కేసీఆర్ ప్రధాని పర్యటనకు హాజరు కావడం లేదు. ఇలా సీఎం ప్రధాని కార్యక్రమానికి హాజరు కాకపోవడం వరుసగా ఇది మూడోసారి. 2020లో ప్రధాని భారత్ బయోటెక్‌ సందర్శనకు వచ్చినప్పుడు కేసీఆర్ పర్యటనకు రావొద్దని పీఎంవోనే వెల్లడించింది. గత ఫిబ్రవరి 5న కూడా మోదీ హైదరాబాద్ వచ్చారు. ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు కూడా కేసీఆర్ అందులో పాల్గొనలేదు.