Kalvakuntla Kavitha: రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఎంతటి విషాదాన్ని మిగుల్చుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగ్నల్ జంపింగ్ వల్లనో, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనో లేదా రాంగ్ రూట్‌లో వెళ్లడమో.. కారణమేదైనా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు జరగడం చాలా ఎక్కువ. వాటికి సంబంధించిన వీడియోలు గతంలో ఎన్నో పోలీసులు విడుదల చేశారు. వాటి ద్వారా ప్రజలు చాలా వరకూ గుణపాఠం నేర్చుకున్నారు. ఎంతో మంది మార్పు చెంది రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం వంటివి చేస్తున్నారు. కానీ, ఇంకా కొంత మంది యువకులు మాత్రం ఎలాంటి రూల్స్ పాటించకుండా రోడ్డు మీదకు వస్తున్నారు.


బయటికి వెళ్లిన వాహనదారులు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనకరంగా గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా బైకర్లు ప్రమాదాలకు గురైనప్పుడు తలకు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మందికి ఇంకా పట్టింపు ఉండటం లేదు. అయితే, ఇందుకు భిన్నంగా కొంత మంది మాత్రం రోడ్డు నిబంధనలను పక్కాగా పాటిస్తున్నారు. 


ఈ మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఓ వీడియో ట్వీట్ చేశారు. రోడ్ సేఫ్టీ రూల్స్ ఎంత పక్కాగా పాటిస్తున్నారో తెలిపే వీడియో అది. బుధవారం (మార్చి 23) నానక్‌రాం గూడ చౌరస్తా నుంచి వెళ్తుండగా, బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ తాను హెల్మెట్‌ ధరించడమే కాకుండా స్కూల్‌కు తీసుకెళ్తున్న నాలుగేళ్ల తన చిన్నారికి కూడా హెల్మెట్‌ (Helmet) పెట్టింది. ఇలా ఇద్దరూ స్కూటీపై హెల్మెట్ ధరించి వెళ్లడం కవితను ఆకర్షించింది. వారు ఇద్దరూ హెల్మెట్ ధరించడం తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. 


ముచ్చటపడ్డ ఈ దృశ్యాన్ని కవిత (Kavitha) వీడియో తీసి ట్విటర్‌‌లో ఫాలోవర్లతో పంచుకున్నారు. ఓ తల్లి తాను హెల్మెట్ ధరించడమే కాకుండా తన కూతురికి కూడా హెల్మెట్‌ ధరింపజేసి స్కూటీ నడిపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారంటూ ఆమె ట్వీట్‌ చేశారు.