తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి కొల్హాపూర్‌లోని దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని కేసీఆర్‌ ఫ్యామిలీ దర్శించుకోనుంది. 


సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రత్యేక విమానం బయల్దేరి మహారాష్ట్ర చేరుకుంటారు. కొల్హాపూర్ చేరుకొని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. దేశంలోని అష్టాదశ పీఠాల్లో కొల్హాపూర్ ఆలయం ఏడోది. ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీ దేవి ఆలయం చాలా ప్రత్యేకత కలిగిందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా లక్షలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటారు.


ఫిబ్రవరిలో కూడా కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. అప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే పిలుపు మేరకు ముంబయి వెళ్లి ఆయన్ని కలిశారు. ఆయనతోపాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా కలిసి జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. దేశంలో ప్రత్యామ్నాయన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే గట్టిగానే చెప్పారు. ఆ సమావేశంలో మంత్రి సంతోష్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఈసారి పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైందని... రాజకీయాలతో సంబంధం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి.