తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పేషీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఓ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు చేశాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా యువతిపై లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది. అయితే, దీనిపై క్రీడాకారిణి అయిన బాధితురాలు స్పందించారు. ఆమె మంగళవారం ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడారు.


తనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించారు. తాను జాతీయ స్థాయి మెడల్స్ సాధించిన సమయంలో మంత్రిని కలవడానికి ప్రయత్నించినట్లుగా ఆమె చెప్పారు. అప్పటి నుంచి మంత్రి పేషీలో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేందర్ తనకు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ వేధింపుల గురించి తాను ఇంట్లో కూడా చెప్పానని అన్నారు. ఈ విషయం తెలిసిన ఉద్యోగి.. తాను వేధించిన విషయం ఎవరికీ చెప్పవద్దని వేడుకున్నట్లుగా వివరించారు. మంత్రి చెప్తే తన ఉద్యోగం పోతుందని, మీడియాకు చెప్తే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడని బాధితురాలు వెల్లడించారు.


ఏకంగా క్రీడా మంత్రి సిబ్బంది నుంచి ఇలా వేధింపులు చేయడం ఊహించలేదని అన్నారు. మహిళా క్రీడాకారులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. చాలా రంగాల్లో చాలా మంది రకరకాలుగా వేధిస్తున్నారని.. కొందరు బయట చెప్పుకోలేక కుమిలిపోతున్నారని బాధితురాలు ఆవేదన చెందారు. 


ఈ విషయంలో తాను ధైర్యంగా పోరాడడం వల్ల కొన్నిసార్లు సెలక్షన్ లిస్టులో తన పేరును తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు. మహిళా క్రీడాకారులకు జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి గుర్తింపు లభించలేదని ప్రతిభ ఆవేదన వ్యక్తం చేశారు.


మొన్న స్పోర్ట్స్ స్కూల్‌లోనూ లైంగిక వేధింపుల వ్యవహారం


హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం పెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థినులు, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. బలవంతంగా  విద్యార్థులను బయటకు తీసుకువెళ్లేవాడు. అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను విద్యార్థినలు హాస్టల్‌కు వచ్చాక మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమనే వారు. అంతే కాదు స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసలీలలు జరిపేవాడు. 


ఆయన ఆగడాలకు, మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోజూ సదరు అధికారి కాళ్లు మొక్కాలంటూ విద్యార్థులను ఆ సీనియర్‌ కోచ్‌లు వేధిస్తున్నట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం ఓ బాలిక ఒకరోజు కొన్ని గంటల పాటు పాఠశాల ప్రాంగణంలో కనిపించలేదు. ఆందోళన చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణంలో వెతికారు. కాసేపటికి ఆ బాలిక.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి గదికి ఎదురుగా ఉన్న మహిళా ఉద్యోగి గదిలో లోదుస్తుల్లో కనిపించడంతో నివ్వెరపోయారు.


సదరు మహిళా ఉద్యోగి వినియోగించే జడ పిన్నులు, హెయిర్‌ బ్యాండ్లు ఈ అధికారి గదిలో కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయం స్వీపర్ల ద్వారా బయటకు పొక్కుతుందని గమనించిన ఆయన, వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది తన గురించే చర్చించుకుంటున్నారన్న అనుమానంతో మహిళా ఉద్యోగులనూ హెచ్చరించారని, వారిని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిసింది. మొత్తానికి ఈ విషయం బయటికి రావడంతో ఎట్టకేలకు సదరు అధికారి సస్పెన్షన్ కు గురయ్యాడు.