హైదరాబాద్ లో గ్రీన్ మెట్రో లగ్జరీ పేరుతో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన వాటిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఇవాళ (సెప్టెంబర్ 20) గచ్చిబౌలి స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభించారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతగా 25 బస్సులు హైదరాబాద్‌లో వాడకంలోకి వస్తున్నాయి. నవంబరులో మరో 25 బస్సులు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
రూట్స్ ఇవే..
ఈ ఎలక్ట్రిక్ బస్సులను వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జూబ్లీ బస్ స్టేషన్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులను నడిపించనున్నారు. ఆ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, సీట్ల దగ్గర ప్రయాణికులకు ఛార్జింగ్ పెట్టుకొనే సదుపాయాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.