KTR Vs DK Shiva Kumar: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ డీకే శివకుమార్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌తో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఐటీ రంగంలో దేశంలోనే బెంగళూరు, హైదరాబాద్ తొలి స్థానాల్లో ఉండే సంగతి తెలిసిందే. బెంగళూరుకు సిలికాన్ వ్యాలీ అనే పేరు కూడా ఉంది. ఆ తర్వాత ఆ నగరానికి దీటుగా హైదరాబాద్‌లో కూడా ఐటీ పరిశ్రమ పుంజుకుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఐటీ సిటీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం ‘ఖాతా బుక్’ సంస్థ సీఈవో రవీశ్ నరేశ్ ఓ ట్వీట్ చేశారు.
బెంగుళూరులో ఐటీ కంపెనీలు నెలకొల్పితే మౌలిక సదుపాయాలు సరిగా లేవని మార్చి 30న ట్వీట్ చేశారు. రోడ్లు అస్సలు బాగోలేవని, ఊరికే కరెంటు పోతోందని, నీటి సరఫరా చాలా దారుణంగా ఉందని, ఫుట్ పాత్‌లు వాడుకోగలిగేలా లేవని విమర్శించారు. సిలికాన్ వ్యాలీలో కంటే ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ అప్పుడే స్పందించారు. ‘‘మీరంతా బ్యాగులు సర్దుకొని హైదరాబాద్‌కు వచ్చేయండి. ఇక్కడ మీకు ఉత్తమ సదుపాయాలున్నాయి. ట్లు ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్‌పై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మా దగ్గరున్న ఎయిర్ పోర్టు కూడా ఎంతో మెరుగ్గా ఉంది.’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే, ఆ ట్వీట్‌కు ఇవాళ కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకు వస్తామని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
‘‘శివకుమార్ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. వచ్చే ఎన్నికల్లో అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా.. దేశ యువత, భవిష్యత్తు కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్ పెడదాం. కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో కౌంటర్ ఇచ్చారు.