Hyderabad Niloufer Hospital: హైదరాబాద్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రోజుల వయసు ఉన్న ఓ పసిబిడ్డ ఓ ప్లాస్టిక్ కవర్‌లో కనిపించింది. నిలోఫర్ ఆస్పత్రికి సమీపంలోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ పసికందును ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో వదిలి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి శిశువు ఉన్న కవర్‌ను ఆస్పత్రి ముందు విడిచి వెళ్లిపోయారని తెలిపారు. దీంతో వెంటనే సిబ్బంది ఆ శిశువును బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. ఆ పసిబిడ్డను పరీక్షించిన డాక్టర్లు.. శిశువుకు జాండిస్, అంగవైకల్యం వంటి సమస్యలు ఉన్నట్టుగా తేల్చారు.


శిశువుకు అంగవైకల్యం ఉన్న కారణంగానే సంబంధీకులు ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లిపోయి ఉంటారని సిబ్బంది అనుమానిస్తున్నారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. శిశువు వదిలివెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆటోలో వచ్చిన వారు ఎవరనేది గుర్తించేందుకు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కొద్ది రోజుల క్రితమే కిడ్నాప్
నిలోఫర్ ఆస్పత్రి తరచూ వార్తల్లో నిలిచే సంగతి తెలిసిందే. నీలోఫర్ ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం 18 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. వెంటనే పోలీసులు ఆ చిన్నారి ఆచూకీని, ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించి బిడ్డను కాపాడారు. 


అంతేకాకుండా, ఇంజెక్షన్ వికటించి కొద్ది రోజుల క్రితం ఇద్దరు శిశువులు మృతి చెందారు. నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే శిశువులు మృతి చెందినట్లు వారి తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారుల మృతికి నిరసనగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఘటనపై నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఒక శిశువు మాత్రమే చనిపోయినట్లు తెలిపారు. డైస్ప్లా సియా సిండ్రోమ్‌తో బాధపడుతోన్న ఆ శిశువు ఫిబ్రవరి 28న ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. ఆ శిశువు 7 నెలలో జన్మించడంతో కేవలం కిలో బరువు మాత్రమే ఉందన్నారు. శిశువుకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చామని.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు. శిశువు మృతితో కలత చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.


కామారెడ్డిలోనూ కిడ్నాప్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం (ఏప్రిల్ 4) ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడుని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి పోలీసులు బాలుడిని బాల సదన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.