Lulu Group Investment: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన లులూ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో లులూ గ్రూప్ తమ పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షాపింగ్ మాల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చేసుకున్న ఒప్పందం మేరకు తెలంగాణలో లలూ గ్రూప్ పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటు దారుల్లో ఒకటైన లులూ గ్రూప్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో పెడుతున్న పెట్టుబడులు.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని వివరించారు. అలాగే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. లులూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.