Minister KTR Comments on Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విపరీతంగా తీరిక లేకుండా ఉన్న కేటీఆర్ మంగళవారం (నవంబర్ 14) హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో (Builders Federation meeting) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR Comments) మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత 25 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులే గుర్తుకు వస్తారని మాట్లాడారు.
వారు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అని అన్నారు. గత పాతికేళ్లలో వీరే ప్రధానంగా సుదీర్ఘ కాలం సీఎంలుగా ఉండి రాష్ట్రం మీద, హైదరాబాద్ నగరంపైనా తమదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. వీరిలో చంద్రబాబు ప్రొ బిజినెస్, ప్రొ ఐటీ, ప్రొ అర్బన్ మోడల్ గా ఉండేదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ప్రొ రూరల్, ప్రొ అగ్రికల్చర్, ప్రొ పూర్ (పేదల పక్షపాతి) అని చెప్పారు. కేసీఆర్ విషయంలో రెండూ కలిపిన మోడల్ అని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో స్థిరత్వం అనేది ముఖ్యమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆరు నెలలకోసారి పెద్ద మారితే అక్కడ స్థిరత్వం ఉండబోదని అన్నారు. వేగంగా మెరుగైన నిర్ణయాలు తీసుకొనే పటిమ ఉన్న వ్యక్తి లీడర్ గా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రెండేళ్లు కొవిడేకే పోయిందని, నికరంగా తాము పని చేసింది ఆరున్నర సంవత్సరాలే అని అన్నారు. అంతకుముందు 65 ఏళ్లు అధికారంలో ఉన్న వారు ఏం చేశారో, ఈ ఆరున్నర ఏళ్లలో తాము ఏం చేశామనేది కళ్లెదుటే కనబడుతోందని అన్నారు.
డిసెంబరు నుంచి సింగిల్ విండో
పెట్టుబడిదారుల కోసం డిసెంబర్ 3 తర్వాత నుంచి సింగిల్ విండో పథకాన్ని అమలు చేస్తామని కేటీఆర్ చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా అన్ని సవరిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణలో చూసింది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ఇంకా ఉందని వెల్లడించారు. మొదటి రెండు టర్మ్‌ల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టిసారించామని, తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని తెలిపారు. హైదరాబాద్‌కు ఇంకా సోషల్ ఇన్‌ఫ్రా యాడ్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
నిలోఫర్ కేఫ్ లో కేటీఆర్ సందడి
అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉంటున్న మంత్రి కే.తారక రామారావు బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్ లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్ లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్ పైన ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
బెంగళూరులో పని చేస్తున్న యువకుడి కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బెంగళూరు నుంచి తన కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగరం వినూత్నంగా కనిపిస్తుందని ముఖ్యంగా గత పది సంవత్సరాలలో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని ఆయన తెలిపారు.
దశాబ్దాల క్రితం వారణాసి నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడిన మాకు హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో మారిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణన్ని కలిగి ఉందన్నారు. ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తన కొడుకుకి కేటీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని ఒక మహిళ తెలిపారు.
మహిళలతో సంభాషిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి కుటుంబ నేపథ్యం ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మైనారిటీ కుటుంబంతో ముచ్చటించిన కేటీఆర్... వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నదని ముఖ్యంగా మత ఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్న తీరుబట్ల మైనార్టీ కుటుంబం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసింది.
మంత్రి కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలాగా చాయ్ తాగుతూ పలువురుతో సంభాషించడం చాలామందిని ఆకట్టుకుంది. కేటీఆర్ తో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.