హైదరాబాద్ నగరానికి మరోవైపున ఐటీ రంగం విస్తరణకు బీజం పడుతోంది. నగరానికి ఉత్తర దిశలో ఉన్న మేడ్చల్ జిల్లా కండ్లకోయలో మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన ఐటీ పార్కును నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీనికి భూమి కూడా ఖరారైంది. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
మేడ్చల్ జిల్లా కండ్లకోయలో తెలంగాణ గేట్ వే ఐటీ పార్క్ (Telangana Gateway IT Park) పేరుతో నిర్మించనున్నారు. దీని కోసం చాలా చోట్ల ప్రభుత్వం భూముల పరిశీలన జరిపింది. చివరికి అవుటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఈ భారీ ఐటీ టవర్ నిర్మాణం చేపడుతున్నారు. కండ్లకోయ- మేడ్చల్ జంక్షన్‌లో 10 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు అవుతుందని, ఈ స్థలాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేటాయించింది. 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు ఆఫీస్ స్పేస్ కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50 వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది.
ఈ ఐటీ పార్కు ప్రాంతానికి విమానాశ్రయం నుంచి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యం ఉంది. పైగా రోడ్ల అనుసంధానం వంటి వాటివి సానుకూలం కానున్నాయి. కండ్లకోయ జంక్షన్ దగ్గర ఐటీ పార్కు నిర్మాణం కోసం స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసి.. ఆ బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్) అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు ఆఫీస్ స్పేస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో కాన్ఫరెన్స్ హాల్స్, భారీ పార్కింగు వంటి సౌకర్యాలు అన్నీ కల్పించనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 17న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్న వేళ.. మంత్రి మల్లారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కండ్లకోయకు ఐటీ హబ్ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రెండు, మూడో ఫేజ్‌లో కూడా ఇక్కడే ఐటీ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ ప్రతి ఏటా 16 నుంచి 17 శాతం అభివృద్ధిని నమోదు చేస్తుందని టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు ఉండేవని, ప్రస్తుతం 6.5 లక్షల మంది పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.