తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశ జనాభాలో కేవలం 2.5 శాతంగా ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తూ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నవ తరం ఆటో మొబైల్ రంగంలో హైదరాబాద్ లో మంచి అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కోకాపేటలో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ నెలకొల్పిన సెంటర్ ను మంత్రి సోమవారం (జూన్ 13) ప్రారంభించారు. అమెరికాకు చెందిన అతి పెద్ద ఆటో మొబైల్ సంస్థ హైదరాబాద్ లో రెండో అతి పెద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న వ్యాపార అవకాశాలు మంత్రి వివరించారు.
దేశానికి రెండింతల ప్రభావం చూపగల పరిపాలన అవసరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అంతేకానీ, పనికిమాలిన డబుల్ ఇంజిన్లు అక్కర్లేదని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. ‘‘అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థను 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 450 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా - ఈని ప్రారంభించబోతున్నాం.’’ అని కేటీఆర్ అన్నారు.
మరోవైపు, రాష్ట్ర అభివృద్ధిపై ట్విటర్ వేదికగా కూడా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్లు చేశారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆర్థికంగా మరింత పరిపుష్ఠం అవుతోందని కేటీఆర్ అన్నారు. గతేడాది అక్టోబర్లో రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం, దేశ జీడీపీలో 5 శాతాన్ని కలిగి ఉందని పేర్కొన్నట్లు మంత్రి వివరించారు.