జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు ప్లేటతో దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాలికను ట్రాప్ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అతణ్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి వీరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులు, జువైనల్ హోం అధికారుల జోక్యంతో వారికి సర్ది చెప్పి ఈ వివాదం సద్దుమణిగేలా చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్ హోమ్ కు పోలీసులు భద్రత పెంచారు.
ఏ - 1 సాదుద్దీన్‌కి ముగిసిన పోలీసుల కస్టడీ
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మలిక్ పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం ఏ - 1 అయిన సాదుద్దీన్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీ చివరి రోజైన నిన్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన సంగతి తెలిసిందే.
కార్పొరేటర్ కొడుకే మొదట లైంగిక దాడి!
బాధిత బాలికపై మొదటగా కార్పొరేటర్ కుమారుడే లైంగిక దాడికి పాల్పడినట్టుగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ తర్వాత పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తర్వాత కేసులో ఏ - 5గా ఉన్న బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన బాలుడు (16), ప్రభుత్వ రంగ సంస్థ ఛైర్మన్ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. ఆ తర్వాతే మిగిలిన ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి అయ్యాక ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నాలుగు రోజుల కస్టడీ గడువు ముగియడంతో సాదుద్దీన్ మాలిక్‌ను సోమవారం ఉదయం న్యాయస్థానంలో హజరుపరచి, చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బిర్యానీ తెప్పించలేదు, మామూలు ఆహారమే పెట్టాం - పోలీసులు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన నిందితులకు బయటి నుంచి వారి బంధువులు తెచ్చిన ఆహారాన్ని ఇచ్చారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను పోలీసు అధికారులు కొట్టిపారేశారు. పోలీసుల సెక్యురిటీ కోసం సిబ్బంది బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకున్నారని, అది చూసి నిందితులకు ఆ ఆహారం పెట్టామేమో అని ఓ వర్గం మీడియా భ్రమ పడిందని అన్నారు. నిందితులకు అందరిలాగే పప్పు అన్నం మాత్రమే ఇచ్చినట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.