Minister KTR: సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ కార్యాలయాల చుట్టూ తరిగాల్సిన పని లేదని.. భాగ్యనగరంలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. నేటి నుంచి కొత్త పాలను అందించబోతున్నట్లు స్పష్టం చేశారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వం కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్.. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ.. వార్డు అధికారితో పాటు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున 150 వార్డుల్లో మొత్తం 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని వివరించారు. ఎంతకాలం సమస్యలు పరిష్కరించాలనే విషయమై వార్డు కార్యాలయంలో పౌర సరఫరాల పత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండగా.. అందులో కోటి మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పారు. 



భాగ్యనగరంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారని... లక్షలాది మందికి సేవలు అందించేందుకు క్షేత్రస్థాయి పాలన సాగించామన్నారు. వార్డు పాలకవర్గం ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, చిన్న మున్సిపాలిటీల్లో వార్డు అధికారి ఉంటారని తెలిపారు. ఇక కోటి జనాభా దాటిన జీహెచ్ఎంసీలో కేవలం 35 వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. అందుకోసం వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో వార్డులో పది మంది సిబ్బంది ఉండగా... అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డుకు నేతృత్వం వహిస్తారు. సమస్యల పరిష్కారానికి సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం సిటిజన్ చార్టర్ ఇచ్చినట్లు వెల్లడించారు. జవాబుదారీతనం, సుపరిపాలన కోసం వార్డు కార్యాలయం ఏర్పాటు చేయబడిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని సూచించారు.