తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న ప్రారంభమైన 'దోస్త్' ప్రక్రియ జులై 10 వరకు కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగిన నేపథ్యంలో.. తర్వాతి  రెండు, మూడో విడతలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వీరికి జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించారు.


జూన్ 16 నుంచి  26 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు..


'దోస్త్' రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. జూన్ 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. విద్యార్థులకు జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.


➥ ఇక మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులకు జులై 10న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు.


రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సులకు సంబంధించి మొత్తం 4,73,214 సీట్లు ప్రతీ ఏటా ఉండేవి. అయితే ప్రతీ ఏడాది 2 లక్షల నుంచి 2.50 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో అడ్మిషన్లు, మరికొన్ని కాలేజీల్లో 15 శాతం లోపే ప్రవేశాలు జరిగేవి. దీంతో కాలేజీలు కోర్సులను నడపలేకపోతున్న నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టి 86,670 సీట్లను గతేడాదిలోనే ఫ్రీజ్‌ చేశారు. 


'దోస్త్' నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Website