హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్ జలవిహార్‌లో శనివారం (నవంబరు 4) తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ ఓ పెద్దాయన దగ్గర పిప్పరమెంట్లు కొన్నారు. ఈ వృద్ధుడు సత్యనారాయణ హైదరాబాద్‌లో ఎక్కడ ఇలాంటి సమావేశాలు జరిగినా, అక్కడ పిప్పరమెంట్ బిళ్లలు, చాక్లెట్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా ఈ వృద్ధుడు శనివారం తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి కూడా వచ్చి అదే పని చేసుకుంటున్నాడు. కేటీఆర్‌, ఇతర ప్రముఖులు వేదికపై కూర్చుని ఉండగా.. ఆ సమయంలో కేటీఆర్‌ను చూసిన సత్యనారాయణ పిప్పరమెంట్లు తీసుకోవాలని సరదాగా సైగ చేశాడు. మంత్రి ఆయన్ను చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి పిప్పరమెంట్లను తీసుకున్నారు. బాగున్నారా అని ఆ పెద్దాయన్ను పలకరించారు. ఆ వృద్ధుడు నవ్వుతూ నేను తెలుసా సారూ.. మీకు అని అడిగాడు. ఇంతకుముందు కూడా ఇలానే పిప్పరమెంట్లు అమ్ముకుంటుంటే చూశానని కేటీఆర్‌ చెప్పారు. 


ఆ తర్వాత ఆ పెద్దాయన వివరాలు తెలుసుకోమని మంత్రి తన సిబ్బందికి చెప్పడంతో వారు ఆయన వివరాలు సేకరించారు. తాను ఒంటరిగా నివసిస్తున్నానని పాతబస్తీలో ఉంటానని చెప్పాడు. తనకు ఇల్లు లేదని తెలిపాడు. వయసు పైబడడం వల్ల తిరుగుతూ ఇలా అమ్ముకోలేకపోతున్నానని అన్నాడు. ఓ చిన్న షాపు పెట్టుకోవడానికి సహాయం చేయాలని కోరాడు.