వైద్యాధికారులకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు నెలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించాలని నిర్దేశించారు. జులై నాటికి ప్రైవేటు హాస్పిటల్స్‌ పని తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల రేటు బాగా తగ్గించాలని హరీశ్ రావు అన్నారు.


నెల వారీ (హెల్త్ క్యాలెండర్) సమీక్షలో భాగంగా పీహెచ్‌సీల ప‌నితీరు, పురోగతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఆదివారం (జూన్ 5) అన్ని జిల్లాల డీఎం అండ్ హెచ్‌వోలు, ప్రోగ్రాం ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సూప‌ర్‌వైజ‌రీ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సి-సెక్షన్ల రేటు, ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, ఐహెచ్ఐపీ, టీబీ, టీ-డయాగ్నొస్టిక్, తదితర వైద్య సేవలపై జిల్లాలు వారీగా సమీక్ష చేశారు. 


ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రాథమిక దశలో రోగాలు గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగంగా మారకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుంది. ఇందులో పీహెచ్‌సీలది కీలక పాత్ర. క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలు తెలుసుకునేందుకు, తక్షణం పరిష్కరించి ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య అధికారులు ప్రతి నెల అన్ని పీహెచ్‌సీలు తప్పని సరిగా సందర్శించాలి. నెలలో ఒక రోజు రాత్రి 24×7 పీహెచ్‌సీలో నిద్ర చేయాలి.’’ అని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు


నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన మంత్రి
ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. వచ్చే నెల రోజుల్లోనే వెయ్యి డాక్టర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. పల్లె దవాఖానాలు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో పని చేయడానికి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. పల్లె దవాఖాన, బస్తీ దవాఖానా, పీహెచ్‌సీల్లో పని చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


ఈ ఆస్పత్రుల్లో పని చేసే వారికి ఈసారి 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల్లో రిజర్వేషన్ల సౌకర్యం కల్పించామని అన్నారు. 200 డాక్టర్లు ఈ సంవత్సరం పీజీలో జాయిన్ అయ్యారని వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పీజీ సీట్స్ కూడా పెంచినం, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు ప్రభుత్వ రంగంలో 570 పీజీ సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుండి పీజీ సీట్ల సంఖ్య 1,212కు పెంచనున్నాం. ఏడేళ్లలో డబుల్ సీట్లు పెంచాం’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.