Jubille Hills Girl Gang Rape Case Latest News: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో పోలీసులు ఇప్పటిదాకా నలుగురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్లు కాగా, మరో ఒక వ్యక్తి 18 ఏళ్లు దాటిన మేజర్ అని హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏ - 1 గా సాదుద్దీన్ మలిక్ (ఎంఐఎం నేత కొడుకు), ఉన్నారు. ఇంకా ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు (మైనర్), సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కొడుకు (మైనర్), ఓ ప్రభుత్వ సంస్థకు ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి కొడుకు (మైనర్) నిందితులుగా ఉన్నారు. అరెస్టయిన ఏ - 1 సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మైనర్లను కూడా అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. నిందితులపై 376D, 323, R/W 5 R/W 6 పొక్సో ఆక్ట్ కింద కేసులు నమోదు చేశారు.


కర్ణాటకలో ఒకరి అరెస్టు
బాలికపై సామూహిక అత్యాచార కేసులో ఓ మైనర్ ను శనివారం రాత్రి కర్ణాటకలోని గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని రహస్యంగా ఉంచి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ముగ్గురిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో వ్యక్తి అరెస్టుతో మొత్తం నలుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.


మరో కొత్త విషయం వెలుగులోకి..
మే 28న బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు అత్యాచారం అనంతరం కారులో మొయినాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్ లో తలదాచుకున్నారు. ఆ ఇన్నోవా కారును కూడా అక్కడే దాచి ఉంచి, దానికి ఉన్న ప్రభుత్వ వాహన స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ ను తొలగించారని సమాచారం. తర్వాత అక్కడి నుంచి తలో దిక్కుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఫాంహౌస్​ యజమాని అయిన రాజకీయ నేతను ప్రశ్నిస్తున్నారు.


మే 28న పబ్ లో మద్యం రహిత పార్టీ
గత మే నెల 28వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక అమ్నేషియా పబ్ లో 28న మధ్యాహ్నం విద్యార్థులు గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్నారు. విద్యార్ధులు సాయంత్రం 5 గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే 17 ఏళ్ల మైనర్ బాలికను ఆరుగురు యువకులు ఎరుపు రంగు బెర్సిడిస్ బెంజ్ కారులో తీసుకెళ్లారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి వారు 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక, వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్దకు మళ్లీ వచ్చి బాలికను వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో బాధితురాలి తండ్రి ఆలస్యంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తొలుత భావించిన పోలీసులు, అత్యాచారం చేసినట్లు బాలిక చెప్పడంతో సెక్షన్లు మార్చి విచారణ మొదలుపెట్టారు.