MCH Hospital Erramanzil: హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో రూ.50 కోట్లతో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణా కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మొదటి సారిగా హైదరాబాద్ లో  ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో తెంగాణలో మూడు ఎంసీహెచ్ ఆస్పత్రులు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ఆ సంఖ్య 27కు చేరిందన్నారు. ఈ ఆస్పత్రుల ద్వారా గొప్ప ఫలితాలు వచ్చాయని వివరించారు. ఎంసీహెచ్ ఆస్పత్రుల నిర్మాణానికి రూ.499 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఎంసీహెచ్ ఆస్పత్రులను 27కు పెంచడంతో మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు.










రూ.55 కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో ఎంసీహెచ్ నిర్మాణం


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మాతా శిశు మరణాలు ప్రతి లక్షకు 92 మరణాలు ఉండేవని.. దాన్ని 43కు తగ్గించగల్గామన్నారు. ప్రతీ లక్షకు శిశు మరణాలు 36 ఉంటే 21కి తగ్గించుకున్నామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలో మూడు స్థానంలో ఉన్నామని.. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గాంధీ ఆస్పత్రిలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ, నిమ్స్ లో 200 పడకలు అల్వాల్ లో కూడా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమ్స్ కు అనుబంధంగా నిర్మిస్తున్న ఎంసీహెచ్ రూ.55 కోట్లతో 4 అంతస్తుల్లో 200 పడకలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ 100 పడకల డయాలసిస్ యూనిట్ ఎక్కడా లేదన్నారు.






34 డయాలసిస్ బెడ్లను 100కు పెంచుతున్నట్లు వెల్లడి


నిమ్స్ లో కేవలం 34 డయాలసిస్ బెడ్లు మాత్రమే ఉన్నాయని.. వాటిని 100కు పెంచుకుంటున్నామని చెప్పారు. దీంతో దాదాపు 1500 మంది రోగులు డయాలసిస్ సేవలు పొందుతారని వివరించారు. వీరందరికీ ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. డయాలసిస్ రోగులను కాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేస్తున్నామన్నారు. ఆసరా పింఛన్ల, ఉచిత బస్ పాస్ లను కూడూ అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు 9 కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మెషిన్ ను ప్రారంభిస్తున్నామన్నారు. 34 మంది కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. రోగుల సంఖ్య అనుగుణంగా వైద్యులను పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.