Minister Gangula Kamalakar: రేషన్ డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని డీలర్లకు సూచించారు. రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలపై మే 11వ తేదీన హైదరాబాద్ లోని అధికారిక నివాసంలో పౌర సరఫరాల కమిషనర్ వి.అనిల్ కుమార్, ఉన్నతాధికారులతో గంగుల సమీక్షించారు. రాష్ట్రంలో రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.3,580 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి నెల 90 లక్షల కార్డులకు చెందిన 2 కోట్ల 82 లక్షల 60 వేల మందికి 1.80 LMT's కేటాయిస్తూ వాటి కోసం రూ. 298 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,220 కు పైగా రేషన్ షాపులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


ఈ డీలర్లు అందరికీ నెలకు 12 కోట్లకు పైగా కమిషన్ రూపంలో అందిస్తున్నామని గంగుల తెలిపారు. రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఉన్నతాధికారులకు మంత్రి గంగుల సూచించారు. మే 22వ తేదీన రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని డీలర్లకు విజ్ఞప్తి చేశారు. రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, పేదల ప్రయోజనాలకు కేసీఆర్ సర్కారు కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు మంత్రి గంగుల కమలాకర్. రేషన్ డీలర్లతో ఈ నెల 22న నిర్వహించే సమావేశంలో డీలర్లతో మాట్లాడి వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపించే దిశగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఆ శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ తో పాటు అధికారులు ఉషారాణి, లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు.


రేషన్ డీలర్ల డిమాండ్ ఇదీ


కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తమ సమస్యలు పరిష్కరించకపోతే, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జూన్ 5వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవదిక సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు మే 10 వ తేదీన సోమాజికూడ ప్రెస్ క్లబ్ లో ఐక్య వేదిక ఛైర్మన్ నాయకోటి రాజు, ఉపాధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు మీడియాతో మాట్లాడారు.


ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం హామీని వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాపును కేటాయించాలని డీలర్లు కోరారు. అలాగే రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. కనీసం గౌరవ వేతనంగా నెలకు రూ. 30 వేలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్య కార్డుల పంపిణీ తో పాటు శాశ్వత ప్రాతిపదికన రేషన్ డీలర్ షిప్ లను కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే సమ్మె, మానవహారాలు, వంటావార్పు, ఛలో హైదరాబాద్ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.