ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలో ధాన్యం సేకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి చెప్పడం లేదని విమర్శించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదని అన్నారు. అసలు వారు ఎంత ధాన్యం కొంటారు? అసలు కొంటారా? కొనరా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిని కలవడం కోసం.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ 4 గంటలు వేచి చూశారని అన్నారు. ఇలా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
‘‘యాసంగి వేయాలా వద్దా.. రైతులకు స్పష్టత ఇవ్వడం లేదు. బీజేపీ నాయకులు చాలా మంది రైతులు కానే కాదు. వారు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవు. వారి సమస్యలు కూడా తెలియవు. చట్టాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ప్రజలను పక్కదోవ పట్టించేలా మాట్లాడారు. ప్రధాని మోదీ స్వయంగా క్షమాపణలు చెప్పి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇలాగే విద్యుత్ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలి. బీజేపీ చట్టాల వలన దేశ రైతులు ఇబ్బంది పడుతున్నారు.’’
‘‘రేవంత్ రెడ్డి ఫకీర్ మాటలు బంద్ చేయాలి. చేతనైతే ఢిల్లీకి వెళ్లి అక్కడ పోరాటం చేయాలి. ఒకసారి ఛత్తీస్‌గఢ్ వెళ్లి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలుపై రేవంత్ అడగాలి. అక్కడి పరిస్థితి ఆయన ముందు తెలుసుకొని రావాలి. యాసంగిపై స్పష్టత ఇచ్చిన వెంటనే ధాన్యం మొత్తం కొంటాం. రైతులకు డబ్బులు ఇస్తే బీజేపీ వాళ్ళు అవహేళన చేస్తున్నారు. రైతులు దేశ రైతుల కోసం పోరాటం చేసి చనిపోయారు. రైతులను ఆగం చేయకూడదు. ఇప్పటికైనా కేంద్ర స్పష్టత ఇవ్వాలి.’’ అని ఎర్రబెల్లి అన్నారు.
కేసీఆర్ రైతుల ఉసురు కొట్టుకోవద్దు: ఈటల రాజేందర్
‘‘ఈ సీజన్‌లో ధాన్యం ఎంతయినా కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. అయినా, కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ముందుచూపు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ ధరకు వడ్లు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ మీరు రాజకీయాలు చేసుకోండి. కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. రైతులతో పెట్టుకున్నవారు ఎవరు ముందుకు పోలేదు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణలు చెప్పి హుందాగా వ్యవహరించింది. మీరు కూడా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనలేదని రైతులకు క్షమాపణ చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయాలి. రైతులు తెలివి లేని వారు.. చదువు రాదు.. సంఘటితంగా ఉండరని అనుకుంటున్నారేమో.. సందర్భం వచ్చినప్పుడు రైతులు మీకు కర్రు కాల్చి వాత పెడతారు.’’
‘‘ఈ వర్షాకాలంలో పంట పండినా సరైన సమయంలో కొనకపోవడం వల్ల తడిచి మొలకెత్తి నెల రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు కన్నీరు పెడుతున్నారు. వారి ఉసురు కొట్టుకోవద్దు. రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని నాలుగు రోజుల్లో కొనుగోలు చేయాలి. లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడి చేస్తాం’’ అని ఈటల రాజేందర్ విమర్శించారు.
Also Read: MP Raghurama: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..