Hyderabad: హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ వాడకం అమాంతం పెరుగుతోంది. సైక్లింగ్ కేవలం హాబీగానో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో భాగంగానో చూడటం లేదు. జీవనంలో ఒక ప్రధాన భాగంగా మార్చుకుంటున్నారు. షార్ట్ కమ్యూట్‌లు, ఆరోగ్య ప్రయోజనాల కోసం సైక్లింగ్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు వాడుకుంటున్నారు. 80వ దశకం వరకు సైకిల్ అనేది చాలా నార్మల్‌ రవాణా సాధనంగా ఉండేది, కానీ మోటారు వాహనాల వచ్చాక సీన్ మారిపోయింది. బైసైకిల్ వినియోగం తగ్గిపోయింది. 


ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి ప్రజల మైండ్‌ సెట్‌ను మార్చేసింది. అప్పటి వరకు ఓ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన వారిలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. జీవనశైలిలో విప్లవాత్మక ఛేంజెస్‌ వచ్చాయి. వ్యక్తిగత ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. 


2021లో ప్రారంభమైన సైక్లింగ్ రివల్యూషన్:
హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ (HCR) 2021లో ప్రారంభమైంది. అప్పటి నుంచి సురక్షిత, సుస్థిరమైన రవాణా పద్ధతిగా సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం 2030 నాటికి 50% మంది హైదరాబాద్ ప్రజలు ప్రజా రవాణాను వినియోగించాలనే లక్ష్యంతో సాగుతోంది. ఆక్టివ్ మొబిలిటీపై దృష్టి సారిస్తూ సైక్లింగ్, నడక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


దేశం అంతటా సైక్లింగ్ వినియోగం:
ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా సైక్లింగ్ విప్లవం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సైక్లింగ్ క్లబ్బులు ఏర్పాటవడంతో సైక్లింగ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. Cycle to Work వంటి కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో సైక్లింగ్‌కు IT ప్రొఫెషనల్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు.


సైక్లింగ్‌కు అనుకూల మౌలిక వసతులు:
సైక్లింగ్‌పై నేటి తరానికి ఉన్న ఆసక్తిని గమనించడం, మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రధాన ఐటి కారిడార్లకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో సైక్లిస్ట్‌లు రోజువారీ ప్రయాణాలకు బైసైకిల్‌ను ఉపయోగిస్తున్నారు. 


స్మార్ట్ సిటీల్లో సైక్లింగ్ పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆసక్తి విపరీతంగా పెరిగింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు, సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. చెన్నై, వైజాగ్‌లో ఫిట్‌నెస్ సైక్లింగ్, గ్రూప్ రైడ్లు మంచి ఫేమస్‌. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలలోనూ  సైక్లింగ్ వినియోగం బాగా పెరుగుతోంది. 


హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ కీలక పాత్ర:
భారత్‌లో సైక్లింగ్ విప్లవానికి హైదరాబాద్ ఒక చిహ్నంగా మారింది. Hyderabad Cycling Revolution వంటి కార్యక్రమాలతో నగరం సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఈ సైక్లింగ్ గ్రూపులు రెగ్యులర్ ఈవెంట్లు, గ్రూప్ రైడ్లు నిర్వహిస్తూ సైక్లింగ్ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.


ఫిట్ ఇండియా మూవ్‌మెంట్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ జాతీయ కార్యక్రమం సైక్లింగ్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైక్లింగ్‌కు అనుకూలమైన మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాయి. ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, శ్రీనగర్, పూణే, ముంబై వంటి నగరాల్లో సైక్లింగ్ మార్గాలు, సైకిల్ షేరింగ్ ప్రోగ్రాములు ఈ విప్లవాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.


పర్యావరణ ప్రయోజనాలు:
సైక్లింగ్ పర్యావరణానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ హితమైన రవాణా పద్ధతిగా మాత్రమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో, కండరాల బలం పెంచడంలో, మానసిక ఒత్తిడి తగ్గించడంలో సాయపడుతోంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.