Court Notice To KCR: మేడిగడ్డ బ్యారేజీ వివాదం... ఎన్నికల ముందు రాజకీయ దుమారం రేపింది. ఆ వివాదం... బీఆర్‌ఎస్ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 17వ తేదీన... కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు కూడా నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి జిల్లా కోర్టు.
అసలు ఏం జరిగిందంటే...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన... మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగడం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని... ఇదివరకే భూపాలపల్లి జిల్లా కోర్టు (Bhupalapally District Court) లో పిటిషన్ వేశాడు భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (Rajalingamurthy). ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... మాజీ సీఎం కేసీఆర్ (KCR)తోపాటు.. మరో ఏడుగురికి ఆగస్టు మొదటి వారంలోనే నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 5వ తేదిన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఉంది. ఆ నోటీసుల్లో మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao), మెగా కంపెనీకి చెందిన కృష్ణారెడ్డి, రజత్‌కుమార్, ఎల్ అండ్ టీ నుంచి ఎండీ సురేష్‌కుమార్ పేర్లు ఉన్నాయి. దీంతో నిన్న (సెప్టెంబర్ 5వ తేదీన) మాజీ మంత్రి హరీష్‌రావు తరపున లాయర్లు లలితా రెడ్డి, సుకన్య... కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ అయిన మెగా నుంచి కష్ణారెడ్డి, ఇరిగేషన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్, ఎల్ అండ్ టీ నుంచి ఎండీ సురేష్‌కుమార్ తరపున సుప్రీం కోర్టు లాయర్లు అవధాని, శ్రవణ్‌రావు... ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున వరంగల్ లాయర్ నరసింహారెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR), ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) తరపున మాత్రం లాయర్లు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో.. కేసీఆర్‌కు, స్మితా సబర్వాల్‌కు మరోసారి నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి జిల్లా కోర్టు. వచ్చే నెల 17న అంటే... అక్టోబర్ 17వ తేదీన తప్పకుండా కోర్టులో విచారణ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కింది. కేసు విచారణను కూడా వచ్చే నెల 17వ తదీకి వాయిదా వేసింది భూపాలపల్లి జిల్లా కోర్టు.
పిటిషనర్ రాజలింగమూర్తి ఏమన్నారంటే...!
మేడిగడ్డ కుంగుబాటుకు బాధ్యులు ఎవరో తేలాలని... అప్పటి వరకు తన పోరాటం ఆగదన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. చట్టం ముందు అందరూ సమానులే అని... చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల... వేల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు రాజలింగమూర్తి. దీనికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు.
మేడిగడ్డ ఎప్పుడు కుంగింది...?
అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు... అంటే.. గత అక్టోబర్‌లో.. మేడిగడ్డ కుంగిందంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు మేడిగడ్డ బ్యేరేజీలోని 19, 20. 21 పియర్లు... వాటి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేర కుంగినట్టు సమాచారం. ఆ తర్వాత... నాలుగు అడుగులు వరకు ఏప్రన్ కుంగిందని సమాచారం. ఏడో బ్లాక్ పియర్లు రోజురోజుకూ కుంగిపోతున్నాయని... బ్యారేజీ మరింత ప్రమాదంలోకి వెళ్తోందని ప్రచారం జరిగింది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్‌వేలోనూ పగుళ్లు కనిపించాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశాన్ని.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. బీఆర్‌ఎస్ తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయ్యిందంటూ... ప్రచారం చేసింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది.
Also Read: తెలంగాణలో డిజిటల్ బస్‌పాస్‌లు- పల్లెవెలుగులో కూడా ఆన్‌లైన్ పేమెంట్ విధానం!