GHMC Mayor Distributed Clay Ganesh Idols In Hyderabad: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె ఉద్యోగులు, సిబ్బందికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల విగ్రహాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు.


తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా మండపాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరేందుకు సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్‌లో భారీ గణపయ్య పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రధాన పట్టణాలతో పాటు వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్‌తో పాటు పల్లెల్లోనూ మండపాల సందడి నెలకొంది. అయితే, మండపాల ఏర్పాటుకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరని.. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


ఈ రూల్స్ తప్పనిసరి



  • మండపాల ఏర్పాటుకు ఉత్తమమైన వస్తువులు వాడాలి. విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు.

  • వర్షం పడినా, మండపాల వద్ద ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నా తగు జాగ్రత్తలు చేపట్టాలి. మండపాల పైభాగం నీరు పడని పరదాలతో కప్పాలి.

  • విద్యుత్ కనెక్షన్లు, లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వాటిని వాడాలి. 

  • సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధిత డీఎస్పీ అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదు.

  • మండపాల వద్ద మద్య నిషేధం అమలులో ఉంటుంది. మండపాల వద్ద ఎలాంటి లక్కీ డ్రా, జూదం నిర్వహించకూడదు.

  • మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఎలాంటి టపాసులు కాల్చకూడదు.

  • మండపాల వద్ద 24 గంటలు కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి. వారి వివరాలు ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

  • అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలి. 

  • భక్తులు సందర్శించే సమయాల్లో క్యూలైన్ విధానం అమలు చేయాలి. 


Also Read: In Pics: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలకు అంతా రెడీ, కొలువుదీరుతున్న గణనాథులు