Hyderabad: భార్య అక్రమాలను భర్త వెలుగులోకి తీసుకొచ్చాడు. అవినీతి పాల్పుడుతున్న భార్య కోట్లు దోచుకుంటుందని తెలియజేస్తూ ఓ హోంటూర్‌ వీడియో చేశాడాయన. తమ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బుల కట్టలే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తన ఇంట్లోనే కాకుండా ఆమె సోదరులకు కూడా లక్షలు ఇస్తోందని ఖాతాల్లో జమ చేస్తోందని వీడియోలో ఆరోపించారు. 


మణికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్య జ్యోతి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు భర్త. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కోట్లు కూడబెడుతోందని చెప్పుకొచ్చారు. దివ్యజ్యోతి అవినీతిపై ఆయన ఏకంగా హోం టూర్ లాంటి వీడియో చేశారు. ఇంట్లోని ప్రతి మూలను చూపిస్తూ ఎక్కడెక్కడ డబ్బు కట్టలు ఉన్నాయో చెప్పుకొచ్చారు. 


దివ్యజ్యోతి ప్రతి రోజూ ఇంటికి భారీగా లంచం డబ్బు తెస్తుందని ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చాడు భర్త. కమీషన్ల రూపంలో భారీగా అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముందుగా ఓ కవర్‌లో ఉన్న డబ్బులతో మొదలు పెట్టారు. అందులో ఉన్న డబ్బులు వీడియోలో చూపించారు. 


తర్వాత దేవుడి గదికి వెళ్లారు. దేవుడి పూజ చేసుకునే పీఠ వెనకాల దాచిన డబ్బు కట్టలు బయటకు తీసి చూపించారు. ఇలా ఏ మూలన చూసిన డబ్బులు దొరుకుతాయన్నారు. ఆమె భారీగా ఇంటికి డబ్బులు తీసుకురావడమే కాకుండా తన అన్నదమ్ములకు కూడా డబ్బులను ఇస్తోందని చెప్పుకొచ్చారు. అందులో ఒక వ్యక్తి పేరు శరత్‌ అని వివరించారు. 






తర్వాత వీడియోను కిటికీ పక్కనే ఉన్న ర్యాక్‌పై చూపించారు. అక్కడ ఓ కవర్‌లో ఉన్న డబ్బులు చూపించారు. తర్వాత ర్యాక్‌ సెల్ఫ్‌లు తీసి అందులో ఉన్న డబ్బులు చూపించారు. 


డబ్బులు లేకపోతే గౌరవం ఉండదని అమె తరచూ అంటోందన్నారు దివ్యజ్యోతి భర్త. ఆ డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమేనంటూ మాట్లాడుతుందన్నారు. డబ్బు కారణంగానే ఎవరి మాటా వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తోందని తెలిపారు. 


పద్దతి మార్చుకోవాలని వారించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల వద్ద తన సంగతి చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చిందని అందుతే దివ్యజ్యోతి సంగతి తేల్చాలనే ఈ వీడియో చేస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియోతో ఆమె అవినీతి బాగోతాన్ని బయటపెట్టానంటున్నారు.