మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సోమవారం (జూలై 31) సాయంత్రం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఇద్దరూ సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కలిసి మాట్లాడారు. ఫ్యామిలీ విషయాలు, రాజకీయ అంశాల గురించి వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నందున వీరు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ నేడు ఉదయం నుంచి వార్తలు వస్తుండగా.. దీనిపై మంచు మనోజ్ స్పష్టత ఇచ్చారు. భేటీ అనంతరం మనోజ్, మౌనిక దంపతులు మీడియాతో మాట్లాడారు.
పెళ్లి అయిన తర్వాత తాము చంద్రబాబును కలవలేదని, ఆయన్ను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని మంచు మనోజ్ అన్నారు. గతంలో అపాయింట్మెంట్ అడిగినా, ఆయన బిజిగా ఉండడం, తర్వాత తాము అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కలవలేదని అన్నారు. ఇప్పటికి చంద్రబాబును కలిసేందుకు వీలు కుదిరిందని, ఫోన్ చేయగానే రమ్మన్నారని అన్నారు. రేపు తమ తనయుడు పుట్టిన రోజు ఉందని, ఆ సందర్భంగా చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అనే దానిపై విలేకరులు ప్రశ్నించగా సందర్భం వచ్చినప్పుడు మౌనిక రెడ్డే దాని గురించి మాట్లాడారని మనోజ్ అన్నారు.
భూమా మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మేం ఇద్దరం చంద్రబాబు అంకుల్ బ్లెస్సింగ్స్ తీసుకుందామని మా బాబుతో వచ్చాం. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం సాధారణంగా కలిసిన సమావేశం మాత్రమే. ఏ రాజకీయ విషయాలు మాట్లాడుకోలేదు.