TSRTC Ladies Special Bus in Hyderabad's IT corridor: 
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా సర్వీసులను అందించడంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో లేడీస్‌ స్పెషల్‌ బస్సును టీఎస్ ఆర్టీసీ సోమవారం ప్రారంభించింది. జేఎన్‌టీయూ- వేవ్‌ రాక్‌ మార్గంలో ఈ స్పెషల్ బస్సు ఉదయం, సాయంత్రం నడపున్నట్లు ఆర్టీసీ పేర్కొంది..  మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేయనుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్పెషల్ బస్ సర్వీసులను ఐటీ కారిడార్‌లో ప్రయాణించే మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరింది.


 మహిళల కోసం టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులను ప్రారంభించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద సోమవారం (జులై 31) నుంచి ఐటీ కారిడార్ లో ఉద్యోగాలు చేసే మహిళలకు రవాణా సమస్యను తొలగించేందుకు లేడీస్ స్పెషల్ బస్‌ను ఏర్పాటు చేసింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జేఎన్‌టీయూ నుంచి వెవ్ రాక్ వరకు స్పెషల్ బస్ ను ఆర్టీసీ నడపనుంది. నేడు ప్రారంభించిన ఈ సర్వీస్ సక్సెస్ అయితే ఆడవారి కోసం మరిన్ని స్పెషల్ బస్సు సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎప్పటికప్పుడూ తన నిర్ణయాలతో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ఎండీ సజ్జనార్ కృషి చేస్తున్నారు. 






కొన్ని నెలల నుంచి ఆయన నిర్ణయాలతో కొన్ని డిపోలలో ఆదాయం పెరగగా, మరికొన్ని డిపోలలో నష్టం భారీగా తగ్గి రికవర్ అవుతోంది. పల్లె వెలుగు లాంటి బస్ లతో పాటు నగరం నుంచి జిల్లాలకు నడుస్తున్న ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులలో 90, 30 రూపాయల టికెట్లతో సరికొత్త ఆఫర్ లు తీసుకొస్తున్నారు. వీటితో ప్రయాణికులు సాధ్యమైనంతగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించేలా చేస్తున్నారు. 


ఐటీ కారిడార్ లో లేడీస్ స్పెషల్ బస్సు వెళ్లే రూట్ ఇలా..
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసo ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును నడపాలని మూడు రోజుల కిందట ఈఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు 'జేఎన్టీయూ-వేవ్ రాక్' మార్గంలో ఈ నెల 31 నుంచి అందుబాటులోకి వస్తాయని ఎండీ సజ్జనార్ ఇటీవల తెలిపారు. జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ కు ఉదయం 9 గంటల 5 నిమిషాలకు బస్సు సర్వీస్ ఉంటుంది. ఐటీ కారిడార్ వేవ్ రాక్ నుంచి సాయంత్రం 5.50 గంటలకు ఈ లేడిస్ స్పెషల్ బస్ సర్వీస్ నడవనుంది. జేఎన్టీయూ నుంచి ఫోరమ్/ నెక్షస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గ్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్స్, ఇందిరా నగర్, ట్రిపుల్ ఐటీ క్రాస్ రోడ్స్, విప్రో సర్కిల్ క్రాస్ రోడ్స్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వేవ్ రాక్ కు మహిళల కోసం ఐటీ కారిడార్ లో ప్రత్యేక మెట్రో బస్సును ఏర్పాటు చేసింది టీఎస్ ఆర్టీసీ.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial