ఏ కూరగాయలో అయినా సరే ఈజీగా ఇమిడి పోయే మరో కూరగాయ ఏదైనా ఉంది అంటే అది టమాటా మాత్రమే. గత కొద్ది రోజులుగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలకు అందకుండా కొనుగోలుదారుని నెత్తిన గుదిబండలా తయారయ్యింది. పండిస్తున్న రైతులను కోటీశ్వరులను చేస్తున్న ఈ టమాటా రేటు ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుందనుకుంటే..మరోసారి టమాటా రేటు అమాంతం పెరిగిపోయింది.


ఇటీవల తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టమాటా ధర హైదరాబాద్ నగరంలో ఒకేసారి పెరిగిపోయింది. మొన్నటి వరకు 160 నుంచి 180 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. అంతటితో ఆగుతుందా అంటే.. సమస్యే లేదు.. ఈ వర్షాల వల్ల గణనీయంగా పంటలు దెబ్బతినటంతో.. మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. 


విపరీతంగా పెరుగుతున్న టమాటా రేట్ల వల్ల నగరవాసులు అసలు టమాటా ఊసే ఎత్తడం లేదు. దీంతో విక్రయాల పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది. ధర పెరగక ముందే విక్రేతలు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. 


అయితే ఆ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో అక్కడి నుంచి కూడా టమాటాలు రాక కొరత ఏర్పడింది. ఇప్పుడు, హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర జిల్లాలలో టమోటాలు పంజాబ్ నుండి దిగుమతి అవుతున్నాయి. 


ఇప్పటికే చాలా రెస్టారెంట్లు, హోటళ్లు టమాటా వాడకాన్ని బాగా తగ్గించాయి. ఇతర తినుబండారాల్లో కూడా టమాటా ఇవ్వలేం అంటూ కొన్ని ప్రముఖ సంస్థలు ప్రకటించాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలకు రెక్కలు రావడంతో కిలో కొనేవారు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. 


పెరుగుతున్న ధరల వల్ల కూరగాయలు కొనలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడేమో వర్షాల వల్ల పంటలు పాడైతే , అంతకు ముందు ఎండల వల్ల పంటలు నాశనం అయ్యాయి.