ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన సోదరుడు సుబ్రమణ్యంపై తమ్ముడు భార్య కృష్ణ ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లిద్దరు తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని చర్యలు తీసుకోవాలని అందులో వేడుకున్నాడు. ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆమె వీళ్లిద్దరిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తాను గచ్చిబౌలిలోని మీనాక్షి బ్యాంబూస్‌ విల్లాస్‌లో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. తనకు ఈ మధ్య క్యాన్సర్ వచ్చిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు చెప్పారు. 


తనకు జరిగిన అన్యాయం గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు ప్రియ తెలిపారు. ఆ వీడియోలు పోస్టు చేసినప్పటి నుంచి తనపై వేధింపులు ఎక్కువైనట్టు ఫిర్యాదులో ఆరోపించారు. తాను మానసికంగా ఫిట్‌గానే ఉన్నానని తెలిపారు. 


నాలుగు రోజుల నుంచి ఈ ప్రియ ఎపిసోడ్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తనపై కన్నేసిన నారాయణ చిత్రవధ చేశారని ఆరోపిస్తూ తమ్ముడు సుబ్రమణ్యం భార్య ప్రియ పెట్టిన పోస్టులు మెయిన్‌ మీడియాలో వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా వైసీపీ అనూకల మీడియాలో, అభిమానులు దీన్ని షేర్లు చేస్తూ నారాయణపై విమర్శలు చేశారు. ఆమె హెల్త్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా బయటపెట్టారు. 


ప్రియ చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో ఆమె భర్త సుబ్రమణ్యం స్పందించారు. తన భార్యకు మానసిక సమస్యలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. వీడియో ప్రకటన విడుదల చేసిన ఆయన... తన భార్య మాటలు పట్టించుకోవద్దని మీడియాను కోరారు. తమకు వ్యాపారపరంగా, రాజకీయ పరంగా ఉన్న ప్రత్యర్థులు ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారని అలాంటివి నమ్మొద్దని కూడా వేడుకున్నారు. 


భార్య అయిన ప్రియ మాటలు నమ్మొద్దని భర్త సుబ్రమణ్యం వీడియో  రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమె పోలీసు స్టేషన్ గడప తొక్కారు. తనకు వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కూడా భర్తతోపాటు బావ నారాయణపై ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. 


ప్రియ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్


నారాయణ మరదల సోషల్ మీడియా అకౌంట్స్‌ బ్లాక్ అయ్యాయి. ఆమె చేసిన పోస్టులు ఇప్పుడు కనిపించడం లేదు. ఏకంగా ఆ కౌంట్‌ బ్లాక్ చేసినట్టు చూపిస్తోంది.