హైదరాబాద్‌లోని మల్కాజిగిరి నియోజవర్గంలో మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజేశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్ రోడ్డు వరకు 15వేల మందిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ మల్కాజిగిరి అభ్యర్థిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో... ఆ టికెట్ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఖరారైనట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. మామఅల్లుళ్లు కలిసి మల్కాజిగిరి నియోజకవర్గంలో బలప్రదర్శన చేశారు. భారీ ర్యాలీతో మల్కాజిగిరిలో ఎన్నికల హంగామా కనిపించింది. ఇది ఆరంభం మాత్రమే అన్ని మల్లారెడ్డి వ్యాఖ్యలు... కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
ర్యాలీలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి... మల్కాజిగిరి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తనదైన స్టయిల్‌లో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మల్లారెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కూడా చురకలు వేశారు. ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో... మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో పండుగ వాతావరణం కనిపిస్తోందని... దసరా ముందే వచ్చేసిందని అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే అని.. రాబోయే రోజుల్లో సినిమా చూపించాలన్నారు. మల్కాజిగిరికి రాముడు వచ్చేశాడు.. రాజేశేఖరుడు వచ్చేశాడు అని అన్నారు. ఈసారి మనకు అవకాశం వచ్చింది కనుక... లక్ష ఓట్ల మెజార్టీ గెలిపించాలని కోరారు మల్లారెడ్డి.
మల్కాజ్‌గిరి నిజయోకవర్గ ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు భరించారని... ఇక భరించాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్ అంటే రామ రాజ్యమని అన్నారు. రామరాజ్యంలోకి మన రాముడు వచ్చాడని చెప్పారు. మల్కాజిగిరిలోనూ రామరాజ్యం తెచ్చేందుకు రాముడిగా రాజశేఖరుడు వచ్చాడని అన్నారు. తప్పకుండా... రావణాసురుడుని కాల్చి వదిలి పెడతామన్నారు. దసరా రోజు ఆ రావణాసురుడిని కాల్చి... రామరాజ్యం తీసుకొస్తామన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, కరెంట్, దళితబంధు ఏవీ లేవని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక... కనకారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే... మల్కాజిగిరికి మిషన్‌భగీరథ ద్వారా మంచినీళ్లు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు కాంగ్రెస్ అంటేనే రౌడీలు, గుండాగాళ్లు, దగాకోరులని అన్నారు. కాంగ్రెస్ అంటే స్కాములు.. బీఆర్‌ఎస్ అంటే స్కీములు అన్ని అన్నారు మల్లారెడ్డి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. మల్కాజిగిరి ఎంపీకి ఇక్కడకు రావడానికి ముఖం లేదని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కుని వచ్చాడన్నారు. నోటుకు ఓటు చేసింది ఆ ఎంపినే అన్నారు మల్లారెడ్డి. ఒక్కరోజైనా మల్కాజిగిరి వచ్చారా అని ప్రశ్నించారు మల్లారెడ్డి. 56ఏళ్లు పాలించిన కాంగ్రెస్... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. భూమి నుంచి ఆకాశం వరకు అంతా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. మల్కాజిగిరి ప్రజలు.. ఇక్కడ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు. క్రమ శిక్షణ తప్పితే బీఆర్ఎస్ నుంచి డిస్మిస్ చేస్తామన్నారు. పార్టీకి ద్రోహం చేశారని పొంగులేటి, వివేక్ వెంటస్వామి లాంటి వాళ్ల కూడా పార్టీ నుంచి డిస్మిస్ చేశారన్నారు. ఈసారి బీఆర్ఎస్‌కు ఓట్లు వేసి కాంగ్రెస్‌పై పగతీర్చుకోవాలన్నారు మల్లారెడ్డి.
ఇక, మల్కాజిరిగి ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి. మల్కాజిగిరి కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహేంద్ర హిల్స్‌లో రియర్వాయర్ కట్టాలని, చెరువుల వల్ల కాలనీలు ముంపునకు గురవకుండా.. డ్రైనేజీ పనులు కూడా పూర్తిచేసుకోవాల్సి ఉందన్నారు. ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.