BRS MLA Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి: మల్కాజిగిరి (Malkajgiri) నియోజకవర్గంలో డంపింగ్ యార్డును తొలగించి, అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ మేరకు మచ్చబోల్లారం డివిజన్ పరిధిలోని స్మశానవాటికలోని డంపింగ్ యార్డును తొలగించి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ చెత్తలోనే కూర్చొని ధర్నా నిర్వహించారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy).
స్థానికులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్నా
"స్టాప్ ఇల్లీగల్ డంపింగ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్" అనే నినాదంతో దాదాపు నలభై కాలనీల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. భారీగా స్థానికులు పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... ”,ప్రజల ఆరోగ్యాన్ని, హిందూ సాంప్రదాయాలను మనోభావాలను లెక్క చేయకుండా ఇష్టానుసారం అధికారులు వ్యవహరించడం సమంజసం కాదు. అక్రమ డంపింగ్ యార్డులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త వల్ల ప్రజాజీవనం కాలుష్యభరితమైపోతుంది. చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.

జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడిస్తాం..
అసలే భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయి. వీటికి తోడు పర్యావరణం పూర్తిగా కాలుష్య భరితంగా మారుతోంది. అధికారులు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా పనిచేయడం మానుకోవాలి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతే వరకు ప్రతి రోజూ ధర్నా నిర్వహిస్తాను. అవసరమైతే అల్వాల్ జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడిస్తాం. సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి, అవినీతి అధికారుల పై చర్యలు తీసుకునేలా చేస్తామని’ అన్నారు.