Telangana Assembly Sessions | హైదరాబాద్: నిన్నటివరకూ పసుపు రైతుల సమస్యలు, పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంపై బీఆర్ఎస్ నేతలు పోరాటం చేశారు. పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్ రైతుల కష్టాలు తీరలేదని ఎమ్మెల్సీ కవిత పలుమార్లు వ్యాఖ్యానించారు. తాజాగా మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. శాసనమండలి ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మిర్చి దండలు వేసుకొని నిరసన తెలిపారు.  25వేల గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.


మిర్చికి మద్దతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్


ఎమ్మెల్సీ కవిత, మధుసూదనాచారి, మహమూద్ అలీ తదితరులు నిరసలో పాల్గొని మిర్చి పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలన్నారు.  
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది. కానీ ధర లేకపోవడంతో ఈ సీజన్లో సగానికి విస్తీర్ణం తగ్గిపోయింది. కేవలం 2 లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణానికి మిర్చి పంట తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి  నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు 25 వేల రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని’ డిమాండ్ చేశారు.


ప్రభుత్వ నిర్లక్ష్యంతో తగ్గుతున్న పంటల విస్తీర్ణం..


తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు లేనిదే రాజ్యం లేదని నినాదాలు చేశారు. మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి రైతులకు మద్దతు లేకపోవడంతో బీఆర్ఎస్ హయాంతో పోల్చితే.. కాంగ్రెస్ పాలనలో పలు పంటలు పండించే విస్తీర్ణం తగ్గిపోతోందని ఆరోపించారు.