Maharashtra Couple Padayatra for BRS party: భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర లోని నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తనకు మద్దతు లభిస్తుందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన దంపతులు బీఆర్ఎస్ పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నారు. 


తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని మహారాష్ట్రలోని రాజురాకు చెందిన బాబారావ్ మస్కే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ రాజురా నుంచి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. రాజురా నుండి బాబారావ్, శోభ మస్కే దంపతులు పాదయాత్ర చేపట్టగా హైదరాబాద్ వరకు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ను కలుసుకునేందుకు మహారాష్ట్ర దంపతులు తెలంగాణ పథకాలను వివరిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 


దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీ.ఆర్.ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు బాబారావ్, శోభ మస్కే దంపతులు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబారావ్, శోభ మస్కేలు తమ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ ను కలిసి తమ ఆకాంక్షలను వెల్లడిస్తామని భార్యాభర్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరం ఎంతైనా ఉందన్నారు.


బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్ - మహారాష్ట్రలో మాణిక్ కదమ్ కు కీలక బాధ్యతలు 
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తో పాటు మహారాష్ట్ర, ఒడిశాలపై కేసీఆర్ ఫోకస్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌సెల్‌ అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ నియమితులయ్యారు. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన కేసీఆర్ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ బాధ్యతలను మాణిక్ కదమ్ (Manik Kadam) కు అప్పగించారు. 


మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. 
అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో కేసీఆర్ దేశ వ్యాప్తంగా నినదిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సైతం రాష్ట్రాల్లో రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా వివరాలను బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ చడూనీని నియమించడం తెలిసిందే. తాజాగా రైతు మాణిక్ కదమ్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అక్కడ అధికారంలోకి వస్తే రైతులకు రైతు బంధు ఇస్తాను, 24 గంటలు విద్యుత్ అన్నదాతలకు అని ఇటీవల నాందేడ్ లో జరిగిన బీఆర్ఎస్ సభలోనూ కేసీఆర్ స్పష్టం చేశారు.