IT Raids In Hyderabad   :   తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఏకకాలంలో 20 చోట్ల అధికారులు రైడ్స్ చేశారు. దిల్ సుఖ్ నగర్ లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు . గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి కంపెనీల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడిన 20 మంది అధికారులు రియల్ ఎస్టేట్ కార్యాలయాలే టార్గెట్ గా రైడ్స్ నిర్వహిస్తున్నాయి. 


గతంలో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు                  


ఈ కంపెనీలకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా లేవా అన్న వివరాలు బయటకు రాలేదు.అయితే ఈ కంపెనీలేవీ వందలు, వేల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు నిర్వహించేంత పెద్దవి కావని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా బ్లాక్ మనీ ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్లాట్ల కొనుగోలు విషయంలో ఈ బ్లాక్ మనీ ఎక్కువగా చలామణి అవుతుంది. ప్రభుత్వ  రేటు ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తారు. కానీ మార్కెట్ ధర అంతకంటే ఎంతో ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ధర మాత్రమే డాక్యుమెంట్‌లో చూపించి మిగతా మొత్తం నగదు రూపంలో తీసుకుంటారు. అదంతా  బ్లాక్ మనీగానే భావిస్తున్నారు. అందుకే పొలాల్ని ప్లాట్లుగా మార్చే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఐటీ అధికారులు గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. 


ఇప్పుడు భూముల క్రయవిక్రయాల్లో ఉన్నకంపెనీలపై ఐటీ దృష్టి...              


హైదరాబాద్‌లో చాలా రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాజధానిలో ప్రతి బడా రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఐటీ దాడులు జరిగాయి. మాదాపూర్ తో పాటు ఔటర్ చుట్టూ పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్న కంపెనీలు.. వేల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కంపెనీలన్నింటిలోనూ ఇప్పటికే సోదాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాటి కంటే చిన్న కంపెనీలపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే ఎంత బడా కంపెనీపై దాడులు... చేసిన రోజుల తరబడి సోదాలు చేసినా.. అసలు ఆయా కంపెనీల్లో ఎన్ని అవకతవకలు బయటపడ్డాయన్న విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 


రియల్ ఎస్టేట్‌లో చలామణి అయ్యే  బ్లాక్ మనీపై దృష్టి పెట్టారా ?        


సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అదీ కూడా కాస్త పెద్ద వెంచర్లు అయితే రాజకీయ నాయకుల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ వెనుక కూడా కొంత మంది నేతలున్నారని భావిస్తున్నారు. ఇయితే ఇలాంటి కంపెనీలతో ఆయా నేతల వ్యాపారం నేరుగా ఉండదు కాబట్టి ఇప్పటి వరకూ ఎరూ బయటపడలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఈ ఐటీ దాడులు సహజంగానే సంచలనం అవుతున్నయి.