Latest Weather Updates In Andhra Pradesh And Telangana: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని తెలిపారు అధికారులు. అది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు పడతాయని అంటున్నారు.  ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. 


సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ , నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.   


వరి పంట కోతకు వచ్చే టైంలో పడుతున్న వానలు చూసి అన్నదాత గుండెల్లో రాయి పడుతోంది. ఇ ఏడాది పంట బాగా వచ్చిందని సంబరపడుతున్న టైంలో ఈ అల్పపీడనాలు ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఇప్పటికే వరిని కేసేశారు. దాన్ని కాపాడుకునేందుకు వాళ్ల తల ప్రాణం తొక్కి వస్తోంది. కోత కోసినవి కుప్పగా పోయలేక అలానే వదిలేసిన వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరి పంట వర్షాల ధాటికి నేల రాలిపోతోంది.   
 
తెలంగాణలో కూడా రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్​, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ములుగు, సూర్యాపేట, జనగామ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో  అక్కడక్కడ వానలు పడే అవకాశంఉందని పేర్కొంది.  


Also Read: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు