లంగర్ హౌజ్ వద్ద కుతుబ్ షాహీ కాలం నాటి మసీదుపై సోమవారం పిడుగు పడింది. దీంతో మినార్‌ చాలా వరకు దెబ్బతింది. భారీ వర్షం కురుస్తున్న టైంలో మసీదుపై పిడుగు పడిందని స్థానికులు చెప్పారు దీంతో మినార్‌ ధ్వంసమైంది. దాని శకలాలు విరిగి నేలపై పడ్డాయి. 


మసీదును పరిశీలించిన నిర్వాహక కమిటీ సభ్యులు యాంప్లిఫైయర్లు, వైరింగ్ వంటి విద్యుత్ ఉపకరణాలు చాలా వరకు పాడైపోయాయని గుర్తించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మసీదును సందర్శించి నిర్వహణ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.






జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద గోడ కూలింది. GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు అమీర్‌పేట సమీపంలోని దివ్య శక్తి అపార్ట్‌మెంట్‌లో సహాయకచర్యలు చేపట్టాయి. భారీ వర్షం కారణంగా రెండో అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. DRF బృందాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని శిథిలాలను తొలగించాయి. 


కుండపోత వర్షం హైదరాబాద్‌ వాసులకు చుక్కలు చూపించింది. సాయంత్రం చాలా మంది పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే టైంలో పడిన వర్షంతో నగర ప్రజలు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎటు చూసిన వర్షపు నీరు, వాహనాల బారులు. 


హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేసింది. అసలే సాయంత్రం ఐదు గంటలు దాటితే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ టైంలో వర్షం పడితే ఏమైనా ఉంటుందా. సోమవారం కూడా అదే జరిగింది. ఏ రోడ్డులో చూసిన వాహనాల బారులే కనిపించాయి. ఓవైపు వర్షం ఇంకో వైపు ట్రాఫిక్‌, వారిని నియంత్రించడానికి పోలీసులకు కూడా చుక్కలు కనిపించాయి.  


హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వానతో నగరంలోని రోడ్డులు నదీ ప్రవాహాన్ని తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. అటు హైటెక్‌సిటీ నుంచి ఇటు నాగోల్‌, ఎల్బీనగర్‌, మొహదీపట్నం, మలక్‌పేట, ఇలా ఎటు చూసిన ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది.   సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేరుగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు.