కుండపోత వర్షం హైదరాబాద్‌ వాసులకు చుక్కలు చూపించింది. సాయంత్రం చాలా మంది పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే టైంలో పడిన వర్షంతో నగర ప్రజలు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎటు చూసిన వర్షపు నీరు, వాహనాల బారులు. 


హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేసింది. అసలే సాయంత్రం ఐదు గంటలు దాటితే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ టైంలో వర్షం పడితే ఏమైనా ఉంటుందా. సోమవారం కూడా అదే జరిగింది. ఏ రోడ్డులో చూసిన వాహనాల బారులే కనిపించాయి. ఓవైపు వర్షం ఇంకో వైపు ట్రాఫిక్‌, వారిని నియంత్రించడానికి పోలీసులకు కూడా చుక్కలు కనిపించాయి.  






హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వానతో నగరంలోని రోడ్డులు నదీ ప్రవాహాన్ని తలపించాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. అటు హైటెక్‌సిటీ నుంచి ఇటు నాగోల్‌, ఎల్బీనగర్‌, మొహదీపట్నం, మలక్‌పేట, ఇలా ఎటు చూసిన ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సాయంత్రం ఆరు గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది.   సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేరుగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేశారు.  






మెట్రో ఏరియా, ఫ్లైఓవర్లు ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ ట్రాఫిక్ కనిపించింది. వర్షం పడేలోపు ఇంటికి వెళ్లిపోవాలన్న కంగారు, ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇంటికి చేరాలన్న ఆశతో చాలా మంది ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా డ్రైవ్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని పోలీసులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ పూర్తిగా ఎత్తేశారు. యూటర్న్‌లు పెట్టారు. ఇది కూడా ట్రాఫిక్‌కు కారణంగా వాహనదారులు చెబుతున్నారు.


ఇలా ట్రాఫిక్‌ ఓవైపు, జోరు వాన మరోవైపు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే  040 21111111, 9000113667 నెంబర్లకు ఫోన్‌లు చేయాలని సూచించారు 






ఇవాళ అదే పరిస్థితి
మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ... భద్రాద్రి కొత్తగూడెంల, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, వికారాబాద్‌, జిల్లోల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.