AP Telangana Debts: తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తూనే ఉంటారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్ అని సెటైర్లు వేస్తుంటారు. అయితే తెలంగాణ అప్పుల వివరాలను లోక్​సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ లిఖిత పూర్వకంగా తెలిపారు. మార్చి 2023 నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం అప్పులు రూ 3,66,306 కోట్లు (3 లక్షల 66 వేల 3 వందల 6 కోట్ల రూపాయలు) ఉన్నట్లు ఆమె తెలిపారు.


గత నాలుగైదు ఏళ్ల నుంచి నేటి వరకు అప్పులు ఇలా ఉన్నాయి..
ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు లోక్​సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా ఈ వివరాలు తెలిపారు. 2019 బడ్జెట్ నాటికి తెలంగాణ అప్పుడు రూ 1,90,203 కోట్లు ఉండగా.. 2020కి రూ 225418 కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి రూ 271259 కోట్లు, 2022 ఏడాదికి రాష్ట్ర అప్పు రూ 3 లక్షల 14వేల 136 కోట్లు కాగా, 2023 మార్చి బడ్జెట్ సమయానికి తెలంగాణ అప్పుడు రూ.3.66 లక్షల కోట్లకు చేరుకుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 


అందులో తాజా అప్పుల వివరాలను పరిశీలిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ 6528.95 కోట్లు, హార్టీకల్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరిట రూ.526.26 కోట్లు, రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ నిధి నుంచి రూ. 4,263 కోట్లు, క్రెడిట్‌ ఫెసిలిటీ ఫెడరేషన్స్‌ నుంచి టీఎస్​సీఎస్​సీఎల్ రూ. 15,643 కోట్లు ఉంది. వేర్‌ హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిధి నుంచి రూ. 66.54 కోట్లు, డ్రింకింగ్​ వాటర్​ సప్లై కార్పొరేషన్ పేరిట రూ.1407.97 కోట్లు, టిఎస్‌ మార్క్‌ఫెడ్‌ రూ. 483 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 


AP Debts: 2023 మార్చి వరకు ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు
కేంద్రం ప్రభుత్వం లోక్‌సభలో ఏపీ అప్పుల వివరాలు వెల్లడించింది. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా బదులిస్తూ.. ఏపీ మొత్తం అప్పులు 2023 మార్చి నాటికి రూ.4 లక్షల 42 వేల కోట్లు అని స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ2 లక్షల 64 వేల కోట్లు ఉండగా..  2020 మార్చి నాటికి రూ 3 లక్షల 7వేల 672 కోట్లకు చేరింది. 2021 మార్చిలో రూ 3లక్షల 53 వేల 021 కోట్లు, 2022 మార్చికి రూ 3 లక్షల 93 వేల 718 కోట్ల అప్పు ఏపీ మీద ఉంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టే మార్చి 2023 నాటికి ఏపీ అప్పుల విలువ 4 లక్షల 42 వేల 442 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 
గత కొన్నేళ్ల నుంచి ఏపీ అప్పుల వివరాలు
2019 మార్చి నాటికి రూ2.64 లక్షల కోట్లు
2020 మార్చి నాటికి రూ 3.07 లక్షల కోట్లు
2021 మార్చి నాటికి రూ 3.53 లక్షల కోట్లు
2022 మార్చి నాటికి రూ 3.93 లక్షల కోట్లు
2023 మార్చి నాటికి రూ.4.42 లక్షల కోట్లు


ఓవరాల్ గా చూస్తే తెలంగాణ అప్పులు రూ 3.66 లక్షల కోట్లు కాగా, ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు అని కేంద్రం వెల్లడించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial