ధరణి పోర్టల్ రావడం వల్ల ఒకరి భూమిని అతని అనుమతి లేకుండా ఎవరూ మార్చడానికి వీలు లేకుండా వ్యవస్థను మార్చగలిగామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దాని వల్లే రైతు బంధు కూడా ఎవరికి లంచాలు ఇవ్వకుండానే ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా వస్తాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. నేడు (జూలై 24) భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పని అనిల్ కుమార్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి, అనిల్ కుమార్‌రెడ్డి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిపోయి అక్కడ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
అనిల్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఒక టాస్క్ కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. తనకంటే ముందు గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పని చేశారని ఎవరూ లక్ష్యాలను చేరుకోలేకపోయారని అన్నారు. తాను మాత్రం ఒక టాస్క్ లాగా పని చేస్తున్నామని అన్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో రైతుల పరిస్థితి గతంలో కంటే మెరుగుపడిందని, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని.. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. 3 గంటల విద్యుత్ అంటే కాంగ్రెస్‌ను రైతులు తిట్టుకుంటున్నారని అన్నారు. 24 గంటలు ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తీరిపోయిందని తెలిపారు.
రాష్ట్రంలోని రైస్ మిల్స్ అన్నీ ధాన్యంతో నిండిపోయాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బాగుంటేనే పది మందికి అన్నం పెడతాడని చెప్పారు. బస్వాపూర్ ప్రాజెక్టుతో భువనగిరి, ఆలేరులో కరవే రాదని అన్నారు. తలసరి ఆదాయంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉన్నదని అన్నారు.