హైదరాబాద్ లో మళ్లీ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి ఫలితంగా నగరంలో అన్ని ప్రధాన చోట్ల ట్రాఫిక్ కిలో మీటర్ల కొద్దీ ఏర్పడింది. రోడ్లపైన వాన నీళ్లు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రమైన అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






ఖైరతాబాద్, పంజాగుట్ట, నిమ్స్ హాస్పిటల్, అమీర్ పేట, తీగలవంతెన - ఐకియా జంక్షన్, ఐకియా జంక్షన్ (మైండ్ స్పేస్ కూడలి) చుట్టుపక్కల మార్గాలు, మాదాపూర్ - కొండాపూర్ మార్గాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గూగుల్ మ్యాప్స్ లో సైతం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే సూచికగా రెడ్ కలర్ కనిపిస్తోంది.


ఇటు కర్బాలా మైదాన్, పార్క్ లేన్, రొచా బజార్, జేమ్స్ స్ట్రీట్, అజామ్ హోటల్, రాణి గంజ్ నుంచి కర్బాలా మైదాన్ మార్గాలు సహా.. అప్పర్ ట్యాంక్ బండ్, లేపాక్షి, చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో కూడా చాలా నెమ్మదిగా వాహనాల కదలిక ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ప్రాంతాల్లో చిక్కడ్ పల్లి, బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండి వాహనాలను నియంత్రిస్తున్నారని వెల్లడించారు.






నల్లకుంట మెయిన్ రోడ్డు, ఫీవర్ హాస్పిటల్, తిలక్ నగర్, శివమ్ రోడ్ ప్రాంతాల్లో అంబర్ పేట్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. శాంతి థియేటర్, నారాయణగూడ వైఎంసీఏ, నారాయణ సర్కిల్ - బర్కత్ పుర సర్కిల్ ప్రాంతాల్లో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారు. 






కోటి ఉమెన్స్ కాలేజీ, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్స్, లోవర్ బ్రిడ్జి, ఆర్‌యూబీ, నల్గొండ ఎక్స్ రోడ్స్, మలక్ పేట యశోదా హాస్పిటల్, మలక్ పేట్ మెట్రో ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు బేగంపేట్, ప్రకాశ్ నగర్, రసూల్ పుర, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్, విద్యుత్ సౌధ, ఈనాడు, శ్రీనగర్ కాలనీ, సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజీ, చట్నీస్ ప్రాంతాల్లోనూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.










జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో క్యాన్సర్ హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఒరిస్సా ఐలాండ్, రోడ్ నెం 92, డైనోసార్ పార్క్, సిటీ సెంటర్, జీవీకే వన్, తాజ్ క్రిష్ణా, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, హైదరాబాద్ జింఖానా, ఎల్వీ ప్రసాద్ మార్గ్, ఎన్టీఆర్ భవన్, పార్క్ హాయత్, సాగర్ సొసైటీ తదితర చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.