జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కంపెనీ గతేడాది అక్టోబర్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు అందులో అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఆండ్రాయిడ్‌తో పని చేయనున్న ఈ సెకండ్ జనరేషన్ ల్యాప్‌టాప్ త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అమెజాన్ మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఇందులో ఈ ల్యాప్‌టాప్ బ్లూ కలర్‌లో కనిపించింది.


దీనికి జియోబుక్ (2023) అని పేరు పెట్టనున్నారు. డిజైన్ పరంగా చాలా మార్పులు చేసినట్లు దీన్ని చూసి చెప్పవచ్చు. ఎన్నో ఇంటర్నల్ అప్‌గ్రేడ్స్ కూడా చేయనున్నారు. జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్‌ను కూడా కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. దీని ధరను రూ.999గా నిర్ణయించారు. త్వరలో జియో 5జీ ఫోన్ కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.


అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం 2022 మోడల్ కంటే 2023 మోడల్ ల్యాప్‌టాప్ చాలా తక్కువ బరువుతో లాంచ్ కానుంది. 2022 మోడల్ బరువు 1.2 కేజీలు కాగా, 2023 మోడల్ బరువు కేవలం 990 గ్రాములుగానే ఉండనుందట. ఈ రెండు ల్యాప్‌టాప్‌ల మధ్య ప్రధాన తేడా ఇదే.


ఈ ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. జియోఓఎస్ ఇంటర్‌ఫేస్‌ను అందించనున్నారు. మొదటి జియోబుక్ ల్యాప్‌టాప్‌లో కూడా ఇదే అందుబాటులో ఉంది. 2022 మోడల్ తరహాలోనే 2023 మోడల్లో కూడా 4జీ కనెక్టివిటీ అందించనున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించవచ్చని కూడా కంపెనీ అంటోంది.


91మొబైల్స్ కథనం ప్రకారం... ఈ జియో బుక్ ధర రూ.20 వేలలోపే ఉండవచ్చు. జియోబుక్ (2023) స్పెసిఫికేషన్ల గురించి కానీ, ధర గురించి కానీ కంపెనీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. లాంచ్ అయినప్పుడు అన్ని విషయాలు అధికారికంగా తెలియనున్నాయి.


జియో చవకైన ల్యాప్‌టాప్ గతేడాది అక్టోబర్‌లో మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.15,499గా నిర్ణయించారు. రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 11 అంగుళాల డిస్‌ప్లేను ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు.


క్వాల్‌కాం 64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 2 మెగాపిక్సెల్ వెబ్‌క్యాం అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత జియోఓఎస్‌పై జియోబుక్ గత వెర్షన్ ల్యాప్‌టాప్ పని చేయనుంది. 














Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial