తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనలో కేటీఆర్ మంగళవారం అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలిశారు. పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇక్కడున్న మౌలిక వసతులు, ప్రోత్సాహకాలను వివరించారు. దీనిపై పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.


అమెరికాలో మంగళవారం రెండు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మొబిలిటీ క్లస్టర్‌లో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ కోరగా.. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఫిస్కర్ అందుకు ఆసక్తి చూపింది. లాస్ ఏంజెల్స్ లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఫిస్కర్ సంస్థ ఛైర్మన్, సీఈవో హెన్రిక్ ఫిస్కర్, సీఎఫ్ఓ గీతా ఫిస్కర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఫిస్కర్‌ ఐటీ డెవలప్ మెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాథమికంగా 300 మంది ఐటీ నిపుణులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ గురించి మంత్రి కేటీఆర్ ఫిస్కర్ కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. 


మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు, స్థానిక EV పర్యావరణ వ్యవస్థను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, కేంద్ర ఏర్పాటుకు ఉన్న మార్గాలను పరిశీలించేందుకు ఫిస్కర్ కంపెనీ బృందం త్వరలో హైదరాబాద్‌ను సందర్శించనుంది. ఫిస్కర్ కంపెనీకి చెందిన తొలి EV మోడల్ కారు ఓషన్ (Ocean) ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఆ తర్వాత Pear మోడల్ 2023-24 ఏడాదిలో విడుదల కానుంది. ఈ సంస్థ ఈ ఏడాది 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


తెలంగాణలో తమ పరిశోధన అభివృద్ధి, డిజిటెక్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్ వే సంస్థలు ప్రకటించాయి. అమెరికా తర్వాత క్వాల్కమ్ కంపెనీకి రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో అక్టోబర్ లో ప్రారంభం కానుంది. 3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్యాంపస్ ఏర్పాటు తర్వాత 8,700 మంది టెక్ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్ ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు క్వాల్కమ్ కంపెనీ యాజమాన్యం తెలిపింది. మరోవైపు గోల్ఫ్ క్రీడకు చెందిన ప్రతిష్ఠాత్మక కంపెనీ క్యాలవే హైదరాబాద్ లో తన డిజిటల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.