Bandi Sanjay on CM KCR :  యాసంగి ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్(CM KCR) రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ధాన్యం కొనుగోలు(Paddy Procument) విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని ఇకపైనా కేంద్రం తెలంగాణ(Telangana) రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. మంగళవారం దిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు, కశ్మీర్ ఫైల్స్(Kashmir Files), మోదీ(Modi) పాలన విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 


మళ్లీ కొత్త డ్రామా 


"సీఎం కేసీఆర్ కు వయసు మీద పడ్డది. కాయల్ (మతి) తప్పింది. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నడు. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను సృష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నడు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలాడుతున్నరు. నిన్న కూడా పీయూష్ గోయల్(Piyush Goyal) స్పష్టంగా చెప్పారు. రా రైస్ కొంటామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదని, గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నడు. గతంలో ధాన్యం మొత్తం కొనేది మేమే అన్నడు. కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నడు. కేంద్రం వద్దకు పోయి ‘భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోము’’అని సంతకం చేస్తడు. బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మాటమారుస్తడు." అని బండి సంజయ్ అన్నారు. 


ఇండియా గేట్ వద్ద వడ్లు పారబోయలేదే


బాయిల్డ్ రైస్ కొనకుంటే ఇండియా గేట్(India Gate) దగ్గర వడ్లు పారబోస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, బాయిల్డ్ రైస్ కొనకుంటే మరి ఎందుకు ఆనాడు పోయలేదని ప్రశ్నించారు. ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రమే వడ్లు కొనాలని నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరించారని, ఆయన మాత్రం ఫాంహౌజ్ లో వరి పంట వేశారని ఆరోపిచారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రం ఎందుకు సహకరించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు? కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని బండి సంజయ్ ఆరోపించారు. బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.  


టీఆర్ఎస్ కు 5 సీట్లే 


"4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయిండు. పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుండు. సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీ(BJP)కి, టీఆర్ఎస్(TRS) కు వచ్చేది 5 లేకుంటే 9 సీట్లే. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ నీకు వచ్చిన ఇబ్బందేమిటి? అంత అక్కసు ఎందుకు? నీకు నచ్చేది కేడీ నెంబర్ వన్... మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా. 370 ఆర్టికల్(370 Article) వల్ల కశ్మీర్ లో జరిగిన నష్టమేందో తెలుసుకో. కశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే జనం ఆలోచనలో పడితే దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దలు చూపిస్తవా?" అని బండి సంజయ్ ప్రశ్నించారు.