బరువు తగ్గాలని ఎన్నో వ్యాయామాలు చేస్తుంటారు చాలా మంది. ఆహారపరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొంత పరిష్కారం పడకగదిలోనే ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. యూనివర్సిటీ ఆఫ్ షికాగో పరిచేస్తున్న పరిశోధకులు నిద్రకు,బరువు తగ్గడానికి మధ్య సంబంధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. అందులో వారికి ఓ కొత్త విషయం తెలిసింది. అధికంగా నిద్రపోవడం వల్ల కూడా బరువు తగ్గుతారని తేలింది. రోజూ ఒక గంట ఎక్కువసేపు నిద్రపోతే ఎంతో కొంత బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
అధికబరువుతో ఇబ్బంది పడేవారు రోజూ కన్నా మరో గంటసేపు అదనంగా నిద్రపోవాలి. దీని వల్ల వారు ఆ రోజు తినే ఆహారాన్ని తగ్గిస్తారు. పరిశోధనలో పాల్గొన్నవారిలో కొందరు రోజుకి 270 కేలరీల ఆహారాన్ని తగ్గిస్తే, మరికొందరు 500 కేలరీల వరకు తగ్గించారు. ఇలా రోజూ ఒక గంట అదనంగా నిద్రిస్తే, ఆహారం తినడం తగ్గి, ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. కష్టపడకుండా బరువు తగ్గే మార్గం ఇది. ఇలా రోజూ అదనంగా ఒక గంట పడుకోవడం ద్వారా మూడేళ్లలో పదమూడు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు పరిశోధకులు. మొన్నటి వరకు అన్ని పరిశోధనలు నిద్ర తగ్గితే ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. తాజా పరిశోధన మాత్రం నిద్ర పెరిగితే ఏమవుతుందో చెప్పింది.
నిద్ర చాలా అవసరం
శరీరానికి తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. మనస్పూర్తిగా నిద్రపోవడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్ విడుదలడం, మెదడులో ఆకలిని నియంత్రించే భాగం చురుకుగా పనిచేయడం జరుగుతుంది. బరువు తగ్గడానికి వ్యాయామాలు, సరైన ఆహారమే కాదు అధిక నిద్ర కూడా అవసరమే అని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేకాదు నిద్ర వల్ల ఆయుష్షు పెరుగుతుంది. సరైన నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దక్కుతుంది. దీంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా బాగా పనిచేస్తుంది. దీనివల్ల వ్యాధులు త్వరగా ఎటాక్ చేయవు. ఒకవేళ అనారోగ్యం బారిన పడిన కూడా త్వరగా నయం అవుతుంది. నిద్ర తగ్గడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే పిల్లలకు పది గంటల నిద్ర, పెద్దలకు ఎనిమిది గంటల నిద్ర తగ్గకూడదు.
Also read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు