Kalvakuntla Himanshu Rao: ముఖ్యమంత్రి కేసీఆర్‌‌లో నాయకత్వ లక్షణాలకు కొదవ లేదు. ఆయన నుంచి వారసత్వంగా తనయుడు కేటీఆర్‌లో కూడా లీడర్ షిప్ లక్షణాలు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుతం మంత్రి పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక వారి కుటుంబంలోని మూడో తరంలోనూ నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు.. కేటీఆర్ తనయుడు హిమన్షు రావు. చిన్న వయసులోనే ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు.


ప్రస్తుతం హిమన్షు రావు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న సంగతి తెలిసిందే. ఆ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా హిమాన్షు గెలిచారు. క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ (CAS) గా పిలిచే ఆ విభాగానికి ప్రెసిడెంట్‌గా హిమన్షు బాధ్యతలు స్వీకరించారు. నగరంలో విపత్తులు సంభవించిన ప్రాంతాల్లోని బాధితులకు ఆర్థిక సాయం చేయడం కోసం నిధులు సేకరించి వారికి అందజేసే ఒక ప్రత్యేక టీమ్‌కు హిమన్షు నాయకత్వం వహించనున్నారు.


ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఏటా స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఈసారి నిర్వహించిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌ డిప్లొమా ప్రొగ్రాం ఐబీడీపీ -1 (International Baccalaureate Diploma Programme) చదువుతున్న హిమన్షు కూడా పోటీ చేశారు. హిమన్షుతోపాటు స్కూల్‌ కెప్టెన్‌గా కే వీరారెడ్డి, స్టూడెంట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్స్‌గా ఆనన్య ఆనంద్‌ వాస్కర్‌, ఆశిష్‌ గొట్టుముక్కల ఎన్నికయ్యారు. హిమన్షుతో పాటు ఎన్నికైన వారిని స్కూల్ ప్రిన్సిపాల్‌ హేమ చెన్నుపాటి అభినందనలు తెలిపారు.


ఎన్నికల ప్రక్రియ ఇదీ..
ముందు విద్యార్థులు నామినేషన్లు వేయాలి. అలా నామినేషన్లు వేసిన విద్యార్థులను ఎన్నికల ప్యానెల్ ఇంటర్వ్యూ చేసి కొందరిని ఎంపిక చేసింది. వారు తమకు ఎందుకు ఓటు వేయాలో విద్యార్థులకు వివరించాలి. అంటే ఎన్నికల ప్రచారం తరహాలో అన్నమాట. ఎన్నికల తర్వాత ఓట్లను లెక్కించి ఎన్నికల ఫలితాలను కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే, శుక్రవారం గెలిచిన వారు స్టూడెంట్‌ కౌన్సిల్‌ సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు.