International Drugs Peddlar Arrest in Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆశిష్ జైన్ అనే వ్యక్తి ఇంటర్‌నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతణ్ని పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌గా పేర్కొంటున్నారు. అరెస్టు అయిన అతని నుంచి రూ.3.71 కోట్ల నగదు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు తెలిపారు. ఆశిష్ జైన్ హైదరాబాద్ నుంచి అమెరికా సహా ఇతర దేశాలకు సైకోట్రోపిక్ మందులను సరఫరా చేస్తున్నారని తెలిపారు.
ఆశిష్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి దాని గుండా గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ నిందితుడు ఆశిష్ ఇంట్లో ఈనెల 5న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, డ్రగ్స్ రవాణా ద్వారా వచ్చిన రూ.3.71 కోట్లు సహా, ల్యాప్ టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించి ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటిదాకా ఆశిష్ వెయ్యి సార్లకు పైగా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా గుర్తించారు.