BioAsia 2023: హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు జరిగే బయో ఏసియా 2023 సదస్సును తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో మాట్లాడిన కేటీఆర్... తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం చాలా హ్యాపిగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. లైఫ్‌సైన్స్‌ రంగంలో హైదరాబాద్‌ హబ్‌గా మారిందన్నారు. అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌ షేపింగ్‌ నెక్సట్‌ జనరేషన్ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌ కేర్‌ థీమ్‌తో 20వ బయో ఏసియా కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. 






తెలంగాణ ఇప్పటికే లైఫ్‌ సైన్స్‌, ఫార్మా రంగాలకు అనుకూలంగా మారిందని వివరించారు. ప్రపంచంలోని టాప్‌ ఫార్మా కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోని వ్యాక్సిన్‌ తయారీలో తెలంగాణ అగ్రస్థానంలో  ఉందన్నారు. దేశీయంగా కూడా మెడిసిన్ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతిలో 50 శాతం తెలంగాణ నుంచి జరుగుతోందన్నారు.