KTR Delhi Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే స్పందించారు. ఈ రోజు పాట్నాలో విపక్షాల సమావేశం జరుగుతుండగా... మరోవైపు ఢిల్లీ బీజేపీ మంత్రులతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు మరికొంత మందిని మంత్రి కేటీఆర్ కలుస్తున్నారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఎవరు దాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని మాణిక్ రావు థాక్రే పేర్కొన్నారు. 


దిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్..!


రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం దిశగా తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ దిల్లీలో పర్యటిస్తున్నారు. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తో సమావేశమై.. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి కేంద్ర భూములు ఇవ్వాలని, వాటికి సమానమైన భూమిని మరో చోట కేటాయిస్తామని రాజ్‌నాథ్‌ సింగ్ తో చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. రక్షణ శాఖ భూములు ఉన్న చోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందన్న కేటీఆర్.. కంటోన్మెంట్ లీజ్ భూములను జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరినట్లు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. కేంద్రం సంబంధిత భూములు రాష్ట్రానికి అప్పగిస్తే.. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని తెలిపారు. కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని 9 ఏళ్లుగా కోరుతూనే ఉన్నామని, అయినా కేంద్ర సర్కారు ఒప్పుకోవడం లేదని చెప్పారు. మెట్రో రైలు విస్తరణకూ కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, ఎంఎంటీఎస్‌ విస్తరణకూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రజా రవాణా కోసం భూములు అడుగుతున్నామని కేంద్రం సహకరించారని కోరారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial





లఖ్ నవూ, అహ్మదాబాద్ లో కంటోన్మెంట్ భూములను మెట్రో కోసం ఇచ్చారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టులో కూడా కేంద్ర వాటా నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్న కేటీఆర్.. కొత్తగా 31 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మెట్రో ఫేజ్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సహకరించకుంటే కేంద్ర వైఖరిని ప్రజల్లో ఎండ గడతామని కేటీఆర్ అన్నారు. అహ్మదాబాద్ లో వరదలు వస్తే భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేసిన కేటీఆర్.. వరదలతో హైదరాబాద్ నష్టపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. రాష్ట్రానికి కేంద్రం 40 పైసలు మాత్రమే ఇస్తోందని అన్నారు. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.