కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ లో చాలా మంది చేరుతున్నారని అన్నారు. అయితే, తన సోదరుడు కాంగ్రెస్ లో చేరిక విషయం గురించి తనతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడే కాక చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. తన సోదరుడి చేరిక విషయం తనతో మాట్లాడలేదని, తమ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి ఉండవచ్చని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అన్నీ అమలు అవుతున్నాయని అన్నారు.


నేడు మధ్యాహ్నం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తవుతుందని.. రేపు విడుదల అవుతుందని చెప్పారు. ‘‘6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి.. ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం 119 సీట్లపై రేపు ఉదయం ప్రకటన ఉంటుంది. సీఈసీ ఫైనల్ అయ్యే వరకు బయట మాట్లాడకూడదు’’ అని అన్నారు.


రాహుల్ పేరెత్తే అర్హత కేటీఆర్‌కి లేదు - కోమటిరెడ్డి


‘‘వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదు. మిర్యాలగూడ లో కూడా అడిగారు.. అక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్ ఫర్ అవుతుందనేది చూడాలి.. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీకి 70 - 80 సీట్లు వస్తాయి. పొత్తులపై సాయంత్రం క్లారిటీ వస్తుంది. రాహుల్ గాంధీ పేరు మాట్లాడే అర్హత కేటీఆర్ కి లేదు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్? అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాం’’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు రాజగోపాల్ ప్రకటన


అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు. 


తెలంగాణ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది.  ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీలు విడుదల చేసిన జాబితాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. కొందరు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. అదే బాటులో పయనించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. 


27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఆయన  మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉపఎన్నికలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.