Kisan Congress: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయల నష్ట పరిహారం ఎందుకూ సరిపోదని కిసాన్ కాంగ్రెస్ తెలిపింది. కనీసం పదిహేను వేల రూపాయలు అయినా అందించాలని కోరింది. ఆదివారం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో వడగండ్ల వానకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో నష్టపోయిన వారి కనీసం రూ.15 వేలు అయినా ఇవ్వాలని చెప్పారు. పదివేలు పెట్టుబడి పెట్టిన డబ్బులకు సరితూగదని విమర్శించింది. అలాగే పండ్లు, తోటలకు ఎంత ఇస్తారో చెప్పలేదని గుర్తు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో జిల్లాలోని మిర్చ పంటలతో హా మిగతా పంటలు నష్ట పోయారని చెప్పింది. ఇప్పుడు మిర్చీకి కేవలం ఎకరానికి 5 వేల 400 రూపాయలు మొక్కజొన్న పంటకు రూ.330 ఇస్తున్నారని వివరించింది. అది కూడా కొద్ది మంది రైతులకు ఇచ్చి మిగిలిన రైతులకు ఇవ్వలేదని పేర్కొంది. ఇలాంటి సాయం రైతులకు ఏమాత్రం ఊరటను ఇవ్వదని వివరించింది.
అప్పుడేందుకు మాట్లాడలేదు..?
కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రం, రాష్ట్ర సర్కారు మీద కేంద్రం ఆరోపణలు చేసుకుంటూ రైతులకు పరిహారం ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. గత ఏడాది జులై నెలలో గోదావరి పరివాహక ప్రాంతంలో అకాల వర్షాలు కురవడం వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, సాగు భూములు కోతకు గురయ్యాయని, పొలాల్లో ఇసుక మేటలు వేస్తే వాటి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం వెనక ఆంతర్యం ఏమిటని నాయకులు ప్రశ్నలు గుప్పించారు. ఈ పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికను అటు కేంద్ర సర్కారుకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కిసాన్ కాంగ్రెస్ ఇచ్చిందని తెలిపారు.
కడెం ప్రాజెక్టు నష్ట పరిహారంపై నోరు మెదపరేం...?
గతంలో పంటల బీమా పథకంతో రాష్ట్ర వాటా కట్టలేనందున అన్నదాతలు ఆ పథకానికి దూరమైతే కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కిసాన్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాళేశ్వరం, రామప్ప, ప్రాణహిత, పెనుగంగా వెనక జలాలతో ప్రతి సంవత్సరం పంటలు నష్టపోతుంటే పరిహారం ఇవ్వడం లేదని కిసాన్ కాంగ్రెస్ తెలిపింది. ఇలాంటి సమస్యల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. అనాలోచిత ధోరణితో స్థానిక పరిస్థితులకు అనుకూలంగా డిజైన్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో చెక్ డ్యాములను నిర్మించడం వల్ల అవి తెగి సాగు భూములు కోతకు గురవుతున్నాయని నేతలు అన్నారు. కడెం ప్రాజెక్టు కింద భూమి సాగు చేయడానికి వీల్లేకుండా పరిస్థితి తలెత్తితె ఆ పరిహారంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. అందుకే గతంలో అకాల వర్షానికి, వడగండ్ల వానకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు కిసాన్ కాంగ్రెస్ నాయకులు వివరించడంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు.