Key Decisions at Indrakaran Reddy Meeting With Telangana Wildlife Board: పంట నష్టం పరిహారంతో పాటు వన్యప్రాణుల దాడుల్లో సంభవించే మరణాలకు పరిహారాన్ని పెంచాలని తెలంగాణ వన్యప్రాణి మండలి ప్రతిపాదించింది. ఇప్పటివరకూ ఈ విషయాల్లో మరణాలు సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్న రూ. 5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి మండలి సోమవారం సిఫార్సు చేసింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన తెలంగాన వన్యప్రాణి మండలి సమావేశం కాగా, ఈ భేటీలో పలు అంశాలు, ప్రతిపాదనలపై చర్చించారు.


రాష్ట్రంలో మొదటిసారి చేపట్టిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులుల ఆవాసాల్లో ఉన్న రెండు గ్రామాల తరలింపు ప్రక్రియపై చర్చించారు. అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ డోబ్రియాల్ వివరించారు. గత కొన్నేళ్లుగా వన్య ప్రాణులు జనావాసాల్లోకి, గ్రామాల్లోకి సులువుగా వచ్చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలను ఎలుగుబంట్లు, పులులు, ఏనుగులు హడలెత్తించాయి. కనుక వన్యప్రాణులకు, గ్రామాల ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. అటవీ ప్రాంతం ఉన్న జిల్లాల్లో సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
పరిహారం పెంచాలని నిర్ణయం..
పులులు, ఇతర వన్యప్రాణుల దాడులకు సంబంధించ ఘటనల్లో బాధితులకు పరిహారం పెంచాలని నిర్ణయించారు. వణ్యప్రాణుల దాడుల్లో సాధారణ గాయాలైతే లక్ష రూపాయల లోపు వైద్య ఖర్చులు చెల్లిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలకు మించకుండా ట్రీట్ మెంట్ ఖర్చులు, పెంపుడు జంతువులు చనిపోతే రూ.50 వేలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఇప్పటివరకూ పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.6 వేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500 పెంచాలని, పండ్ల తోటలకు గరిష్ఠంగా రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది.


సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలివే.. 
కడెం ప్రాజెక్టు పరిధిలో లక్ష్మీపూర్ ఎత్తిపోతల, నాగార్జున సాగర్ పరిధిలో పెద్దగుట్ట ఎత్తిపోతల పనులు, ఇతర రహదారులు, కేబుల్ పనులకు తెలంగాణ వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ (Hyderabad) లోని వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. హరిణ వనస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా బదలాయింపునకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం చేపట్టనున్నారు. హరిణ వనస్థలి కోసం అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం రహదారి విస్తరణ కోసం చర్చ జరిగినా, ఆ ప్రతిపాదనను మాత్రం వన్యప్రాణి బోర్డు తిరస్కరించింది. అమ్రాబాద్‌లోని వన్యప్రాణి సంరక్షణ ( Amrabad Tiger Reserve )ను దృష్టిలో ఉంచుకుని రహదారి విస్తరణ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి వన్యప్రాణులపై దాడులు జరగకుండా ఏ చర్యలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. వన్య ప్రాణులను అత్యవసర సమయంలో కాపాడేందుకు రెస్క్యూ బృందాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.